సాధారణంగా పొలిటికల్‌ పలుకుబడి ఉండే వ్యక్తులు ఏదైనా కేసుల్లో పట్టుబడి అరెస్టు అయితే గనుక.. వారికి బెయిలు కూడా ఇవ్వవద్దని వారు బయటకు వస్తే గనుక.. సాక్ష్యాధారాలు మాయం చేసే.. తారుమారు చేసే ప్రమాదం ఉంటుందని.. దర్యాప్తు సంఘాల తరఫున న్యాయపీఠానికి విన్నవించడం జరుగుతూ ఉంటుంది. అది సహజం కూడా. అదే సాక్షాత్తూ అధికార పీఠం మీద కొలువు తీరి ఉన్న వారికే సాక్ష్యాలను తారుమారు చేయాల్సిన అవసరం వస్తే...? అదెంత సేపు చిటికెలో పని.. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నా, అధికారిక వెబ్‌సైట్‌లలో ఉన్నా .. ఎక్కడినుంచైనా తాము వద్దనుకున్న సమాచారాన్ని క్షణంలో తుడిచిపెట్టేయగలరు. చూడబోతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు అదేపని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 


విశాఖ మన్యంలో బాక్సయిట్‌ తవ్వకాలకు సంబంధించి చంద్రబాబునాయుడు సర్కారు తాజాగా జీవో విడుదల చేసేసి.. ఆ ప్రాంతంలో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. శనివారం నాడు విశాఖ మన్యం మొత్తం గిరిజనులు, వారి అనుకూల పార్టీలు కలిసి బంద్‌ నిర్వహించారు. ఈ బాక్సయిట్‌ తవ్వకాలకు సంబంధించి విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని.. దీనికి వ్యతిరేకంగా ఎంత వరకైనా పోరాడుతాం అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మొత్తానికి బంద్‌కూడా విజయవంతంగా జరిగింది. 


నిజానికి బాక్సయిట్‌ గనులను ఇలా తవ్వకాలకు కేటాయించడం అనేది... ఎప్పుడో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగింది. ప్రజావ్యతిరేకత వస్తుండడంతో దాన్ని అమల్లోకి తేకుండా ఆపారు. ఆతర్వాతి ప్రభుత్వాలు కూడా ఆ సాహసం చేయలేదు. 2011లో చంద్రబాబునాయుడు కూడా ఈ బాక్సయిట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పట్లో ఆయన గవర్నరు నరసింహన్‌ను కలిసి.. బాక్సయిట్‌ తవ్వకాలు ఆపాలంటూ గవర్నరుకు లేఖ కూడా ఇచ్చారు. అయితే తాజాగా మళ్లీ తన సర్కారులోనే తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు వెబ్‌సైట్‌లోంచి గతంలో తాను ఇచ్చిన లేఖ ప్రతిని డిలీట్‌ చేసేశారని వైకాపా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపిస్తున్నారు. చూడబోతే.. చంద్రబాబు బాక్సయిట్‌ గనులను అడ్డగోలుగా ఇచ్చేయడానికి నిశ్చయించుకున్నట్లుగానే కనిపిస్తోంది. గతంలో తాను వ్యతిరేకించాననే ఆనవాళ్లను కూడా చెరిపేసి.. ఇప్పుడు కొత్తగా జీవో ఇస్తున్నారంటేనే ఆయన ఎంత ముందుజాగ్రత్తతో వ్యూహాత్మకంగా కొల్లగొట్టడానికి ప్లాన్‌చేస్తున్నారో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: