రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంపై ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్. టీడీపీ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొడాలి నాని పేరు ఖరారు కాగా టీడీపీ నుంచి మాత్రం అభ్యర్థి ఎవరన్నది ఇంకా స్పష్టత రాకపోవయినప్పటికీ ఒకరినొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గం ఎవరి అబ్బ సొత్తుకాదు... నా అబ్బ సొత్తు అని బాలకృష్ణ ప్రకటించారు. అందుకు కొడాలి నాని కూడా ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఒకప్పుడు గుడివాడ ఎన్టీఆర్ సొత్తేనని... ఇప్పుడు మాత్రం ప్రజల సొత్తన్నారు. వారు ఎవరిని గెలిపిస్తే వారిదే గుడివాడ అని కుండ బద్ధలు కొట్టారు. అంతేకాదు ఒకవేళ బాలయ్య గుడివాడ నుంచి పోటీచేసినా తాను వెనక్కి తగ్గేది లేదని... ఓడిపోతే రాష్ట్రం వదిలిపోతానని సవాల్ విసిరారు. వీరిద్దరి సవాళ్లకు తోడు కొడాలి నానిపై కృష్ణాజిల్లా టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు మరీ మండిపడుతున్నారు. నాని రాష్ట్రం విడిచి వెళ్లడానికి మూటె, ముళ్లె సర్దుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం, టీడీపీ అండతో గెలిచిన నాని... డబ్బులకు అమ్ముడుపోయాడని తూర్పారబట్టారు. నానికి చీము నెత్తురు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. అయితే గుడివాడలో ఎన్నికల సమయానికి ఎవరెవరు ఎటువైపు మొగ్గుతారో చెప్పడం కష్టమే అయినప్పటికీ.. కీలక పాత్ర పోషించేది మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరు గెలవాలన్నా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ తప్పనిసరి. ఈ విషయం గుడివాడలో అందరూ అంగీకరిస్తున్న విషయం. మరి కొడాలినాని బాలయ్యపైనే సవాల్ చేసేంత దైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.. జూనియర్ అభిమానులు ఏమైనా నానికి లోలోన సపోర్ట్ చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టినా గుడివాడ నుంచి కొడాలి రెండుమార్లు గెలిచి సత్తా చాటుకున్నారు. నానికి బలమైన క్యాడర్ ఉందనడంలో సందేహం లేదు. నాని ఇప్పటికీ ఎన్టీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని సమాచారం. పైకి చంద్రబాబు కుటుంబంతో ఎన్టీఆర్ సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఇప్పటికీ లోలోన వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద 2014 ఎన్నికల్లో మాత్రం గుడివాడ పాలిటిక్స్ అన్నీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల చూట్టూ తిరుగుతాయనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గుడివాడలో టీడీపీ తరుఫున ప్రచారం చేస్తారా? టీడీపీకి ఓటేయండని అభిమానులకు బహిరంగంగం పిలుపునిస్తారా? లేదా అన్నదానిపైనే ఆయన నిర్ణయం ఏంటన్నది తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: