సినిమా ఫీల్డ్ తరహాలోనే రాజకీయాల్లోనూ సెంటిమెంట్లు ఎక్కువే. ఫలానా నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే రాష్ట్రమంతా గెలుస్తుందని.. ఫలానా కాండేట్ గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదని.. ఇలా ఎన్నో రకాలు. చాలాసార్లు అలా జరగడంతో కొందరిపై అలా ముద్రపడిపోతుంది. అలాగే చంద్రబాబుపైనా అలాంటి ముద్రే గతంలో ఒకసారి పడింది. అదేంటంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు కాటకాలు రాజ్యమేలతాయని. 

ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూపుతారు.. 1994- 2004 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న దాదాపు 9 ఏళ్లూ ఏపీలో కరువు పరిస్థితులు దారుణంగా ఉండేవి. దాదాపు నాలుగైదేళ్లు వరుసగా వర్షాలు కరువలేదు. ప్రకృతి ఏపీపై పగబట్టిందా అన్నట్టుగా ఉండేది అప్పట్లో పరిస్థితి. అయినా చంద్రబాబు ఏదోలా నెట్టుకొచ్చారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ప్రపంచమంతా పొగిడినా 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయారు. 

అదేం విచిత్రంమో కానీ.. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ ముఖం చాటేసిన మబ్బులు.. వైఎస్ అధికారంలోకి రాగానే కరుణ కురిపించాయి. వైఎస్ జమానాలో పుష్కలంగానే వర్షాలు కురిశాయి.  మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎల్ నినో ప్రభావంతో ఒకటి, రెండేళ్లు వర్షాలు పడవని రిపోర్టులు వచ్చాయి. బాబు వచ్చాడు.. మళ్లీ కరువు వచ్చిందని అంతా సెటైర్లు వేశారు. 

ఐతే.. ఇప్పుడు సీన్ మారింది. లేటెస్టుగా నైరుతి రుతుపవనాల పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశేషమేమిటంటే.. గత పది, పదిహేనేళ్లలో మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలోని కొన్ని నదుల్లో ప్రవాహం కనిపించింది. కదిరి వంటి ప్రాంతాల్లోనూ జలపాతాలు కళకళలాడుతున్నాయి. దీంతో బాబు అభిమానులు నెట్లో హల్ చల్ చేస్తున్నారు. ఎవడ్రా చెప్పింది.. బాబు వస్తే కరవు వస్తుందని.. ఇప్పుడు చెప్పండామాట అంటూ పోస్టులు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: