మత అసహనంపై అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల పైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. ఇక  శివసేన అమీర్ ఖాన్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భారత్ లో ఒక స్టార్ గా ఇన్ని అవార్డులు రివార్డులు తీసుకొని ఇప్పుడు  భారత్‌లో ఏ ఉపద్రవం వచ్చిందో అమీర్ ఖాన్ చెప్పాలని డిమాండ్ చేసింది. అమీర్ ఖాన్‌ నమ్మకద్రోహుల భాషలో మాట్లాడుతున్నారని శివసేన విరుచుకుపడింది.  

ఈ మేరకు తమ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. అందులో అమీర్ ఖాన్ పైన మండిపడింది. భారత్‌ తమ దేశం కాదనుకున్నవారు దేశభక్తి గురించి, సత్యమేవ జయతే గురించి మాట్లాడకూడదని ఆక్షేపించింది. తాజాగా శివసేన పంజాబ్‌ చీఫ్‌ రాజీవ్‌ టాండన్‌ చేసిన ఓ ప్రకటన సంచలనం రేపింది. అమీర్‌ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయల అవార్డు ఇస్తామంటూ ప్రకటించారు.

అమీర్ ఖాన్, కిరణ్ రావ్


హోటల్‌ సిబ్బందిగానీ లేదా సినీ సభ్యులైనా సరే అతన్ని కొడితే అవార్డు అందజేస్తామని తెలిపారు. అసహనంపై అమీర్ ఖాన్‌ విపరీత స్పందన దేశ ప్రతిష్ఠనే కాకుండా ఆయన ప్రతిష్ఠనూ దిగజార్చేదిగా ఉందని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమీర్ ఖాన్ పై దేశద్రోహం కేసు నమోదైంది. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ తదుపరి చిత్రం 'దంగాల్‌' షూటింగ్‌ పంజాబ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజీవ్‌ టాండన్‌ ఆ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: