వరంగల్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ ను విజయానందంతో ముంచేసింది. ఊహించినదాని కన్నా బంపర్ మెజారిటీతో వరంగల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. గతంలో మెజారిటీని అధిగమించేసింది. దేశంలోనే అతి భారీ మెజారిటీల్లో 7 స్థానం దక్కించుకుంది. తెలంగాణ చరిత్రలో అత్యధిక రికార్డుగా నమోదయ్యింది. గులాబీ చేతిలో ఇంతగా పరాజయం పొందినా కాంగ్రెస్ పార్టీ ఇంకా దీమాగానే ఉంది. 

వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా అసలు గెలుపు తమదే అంటోంది. ఇలాంటి పరాజయాల్లో నైతిక విజయం మాదే అని ఓడిపోయిన పార్టీ చెప్పడం అలవాటే. కానీ కాంగ్రెస్ ఈసారి అలా అడ్డగోలుగా చెప్పడం లేదు. అందుకు ఓ బ్రహ్మాండమైన లాజిక్ చెప్పింది. వరంగల్ ఉపఎన్నికలో జనం కాంగ్రెస్ పార్టీ వైపు ఎలా ఉన్నారో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సర్వే సత్యనారాయణ గారు సెలవిచ్చారు. 

వరంగల్ ఉపఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుపు తనదేనని ఢంకా భజాయిస్తున్నారు. ఆయన విశ్లేషణ చూసి ప్రెస్ మీటుకొచ్చిన విలేకర్లంతా తెల్లబోయారు. అబ్బా.. ఇలాంటి విశ్లేషణ ఇంతవరకూ ఎవరూ చెప్పలేదబ్బా అని బుర్రలు పట్టుకున్నారు. ఇంతకీ అందర్నీ అంతగా ఆలోచనలో పడేసిన అనాలసిస్ ఏంటో తెలుసా.. ఏ ఎన్నికల లెక్కింపైనా ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కేస్తారు. ఈసారి వరంగల్ ఉపఎన్నికల్లో నాలుగంటే నాలుగే పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. 

ఆ నాలుగు ఓట్లూ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణే వచ్చాయి. అంటే నూటికి నూరు శాతం అన్నమాట. ఆ తర్వాత ఈవీఎం ఓట్లలో నాలుగు లక్షల పైచిలుకు మెజారిటీ టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది. సో.. బ్యాలెట్ విజయం సర్వే సత్యనారాయణదైతే.. ఈవీఎం విజయం టీఆర్ఎస్ దన్న మాట. ఈవీఎంలను ట్యాంపర్ చేశారు కాబట్టే గులాబీ పార్టీ గెలిచిందని.. బ్యాలెట్ ను ట్యాంపర్ చేయలేరు కాబట్టే అవి నూటికి నూరు శాతం తనకే వచ్చాయని సర్వే చెప్పుకొచ్చారు. కిందపడినా పైచేయి తనదే అనడం అంటే ఇదే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: