ఒకవైపు ప్రతిపక్షాలకు చెందిన వారిని కూడా తన కోటరీ అనిపించుకునేలా.. దువ్వేయడం మోడీ ప్రయోగించే అనేేకానేక టెక్నిక్కులలో ఒకటి కావచ్చుగాక. కానీ.. అలాంటి మాయోపాయాలు ఆయనకు పెద్దగా ఫలితం ఇస్తున్నట్లుగా లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి, భార్య సునంద పుష్కర్ హత్యకేసులో అనుమానితుడు అయిన ఎంపీ శశిథరూర్ ను గతంలో మోడీ పలు విధములుగా పొగిడిన సంగతి పలువురికి గుర్తుండే ఉంటుంది. స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంటూ శశిథరూర్ ను మోడీ అప్పట్లో బాగానే కీర్తించారు. అయినా శశిథరూర్ కు మోడీ మీద పెద్దగా జాలి , దయ పుట్టినట్లు లేవు. ఆయన ఎడా పెడా వాయించేస్తున్నారు. పార్లమెంటులో తన  ఘాటు విమర్శల రుచిచూపిస్తున్నారు. 


మత విద్వేషంతో, అసహన భావంతో రగిలిపోతున్న భారత్‌లో ముస్లింలకంటే గోవులకే రక్షణ ఎక్కువగా ఉంటోందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. దేశంలో మతవిద్వేషం ఇంత తీవ్ర స్తాయిలో కొనసాగుతుంటే ప్రభుత్వం విదేశాల్లో మేక్ ఇన్ ఇండియా అంటూ ఎలా గొప్పలు చెబుతుందంటూ ధరూర్ ఎద్దేవా చేశారు. లోక్‌సభలో అసహనంపై జరిగిన చర్చలో పాల్గొన్న శశి థరూర్ ప్రస్తుతం భారత దేశాన్ని మతతత్వ బాంబు విభజిస్తోందన్నారు. అందుకే దేశంలో ముస్లింకంటే గోవుకే ఇప్పుడు రక్షణ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. 

 

దేశంలో అసహనం, మతపర విభజన పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశంలో మతఛాందస వాదులు భారత్‌పై విమర్శల దాడి మొదలెట్టాయని  విదేశాల్లో మనకు లభ్యమవుతున్న ఖ్యాతిని చూసి సిగ్గుతో తల వంచుకోవాలని థరూర్ చెప్పారు. వైవిధ్యతను గౌరవించే పునాదిపైనే భారత్ నిర్మాణమయిందని దాన్ని ఎత్తిపట్టడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ నేత హితవు పిలికారు.

 

ఎన్నికల సమయంలో మోదీ చేసిన వాగ్దానాలను గుర్తుచేస్తూ థరూర్ ప్రధానిని తీవ్రంగా ఆక్షేపించారు. తానొక నేతను అనే విషయం మోదీ మరచిపోతున్నారని, అన్ని కులాల, వర్గాల, మతాల ప్రజలతో తాను మాట్లాడవలసి ఉంటుందని ఆయన మర్చిపోయారని థరూర్ విమర్శించారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నపుడు బాంబు పేలుడు జరిగితే దాన్ని రాజకీయం చేయడానికి తిరస్కరించి ఆ మోదీ ఇప్పుడేమైపోయారు, ఎక్కడున్నారు అంటూ కాంగ్రెస్ ఎంపీ థరూర్ పరిహసించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: