భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం ఉంటే ఇక ఆ కుటుంబంలో ఎలాంటి చికాకులూ ఎప్పటికీ ఉండవు. అది లేకపోతేనే.. అన్ని రకాల గొడవలు మొదలవుతాయి. నిన్నటితరం దంపతుల మధ్య ఉంటూ వచ్చినవి ఒక తరహా విబేదాలు అయితే.. నేటి తరం దంపతుల మధ్య బయటపడుతున్నవి ఆధిపత్యానికి సంబంధించిన చికాకులు. ఏది ఏమైనప్పటికీ.. నవతరంలో విడాకులు కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి గానీ, చాలామంది దంపతులు చిన్న చిన్న మనస్పర్ధలతోనే సంసారాలు వెళ్లదీస్తుంటారు. అయితే ఇలాంటి దంపతుల మధ్య కూడా.. ఎంతో రసాత్మకంగా అనుభూతి ప్రధానంగా ఉండవలసిన శృంగారం, సెక్స్‌ అనేది పెడపోకడలు పట్టిపోతున్నది. 


భార్యాభర్తల మధ్య విభేదాలు మనస్పర్ధలు ఉన్న రోజుల్లో కూడా బలవంతపు సెక్స్‌ను చాలా మంది కొనసాగిస్తూ ఉండడం జరుగుతుంటుంది. భార్య తన 'ప్రాపర్టీ' అయినప్పుడు, తన సెక్స్‌ అవసరం తీర్చడం కోసమే ఉన్నప్పుడు ఇక తనకు కోరిక పుట్టినప్పుడు ఆమెతో తీర్చుకుంటే తప్పు ఏంటి? అనే వాదన ఇన్నాళ్లూ పురుష ప్రపంచంలో ఉండేది. అయితే భార్యకు ఇష్టం లేనప్పుడు చేసే సెక్స్‌ను రేప్‌ కింద పరిగణించలేం అంటూ గతంలో అనేక సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 


అయితే ప్రస్తుతం చట్టాలు మారబోతున్నాయి. మహిళలకు మృగాళ్లనుంచి రక్షణ కల్పించడానికి అనేకానేక చట్టాలు మారుస్తున్న కేంద్రప్రభుత్వం, తాజాగా మొగుళ్లనుంచి కూడా రక్షణ కల్పించడానికి కొత్త చట్టానికి రూపకల్పన చేయబోతున్నది. ఇక మీదట భార్యకు ఇష్టం లేకపోయినా కూడా సెక్స్‌ చేస్తే గనుక.. దానిని రేప్‌ (అత్యాచారం) కింద పరిగణించడానికి, దానికి తగిన శిక్షలు విధించడానికి వీలుగా అనువైన చట్టాలు రూపొందబోతున్నాయి. దీనికి సంబంధించి న్యాయకమిషన్‌ నివేదికలు రాగానే చట్టాన్ని తేవడానికి కేంద్రం నిరీక్షిస్తున్నది. ఇది గనుక అమల్లోకి వస్తే, మహిళలకు రక్షణ ఒక ఎత్తు.. డొమెస్టిక్‌ వయొలెన్స్‌కేసులు దుర్వినియోగం అవుతున్నట్లు ఇది కూడా దుర్వినియోగం కావచ్చునని కొందరు వాదిస్తున్నారు. ఇలాంటి చట్టం వల్ల వివాహాలు, విడాకుల బాట పట్టడం పెరుగుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా చట్టం రూపకల్పన జరగాలని కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: