ఏపీ రాజధాని ఎంపిక కోసం చాలా కసరత్తే జరిగింది. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అన్ని విధాలా పరిశోధన చేసి రిపోర్టు ఇచ్చింది. ఏ భూములు రాజధానికి మంచివి.. ఏవి కావో తేల్చిచెప్పింది. ప్రత్యేకించి మూడు పంటలు పండే విజయవాడ చుట్టుపక్కల రాజధాని వద్దని తేల్చి చెప్పింది. సర్కారు భూమలు ఖాళీగా ఉన్న ప్రకాశం జిల్లాలో రాజధాని పెట్టవచ్చని సూచించింది. 

కేంద్రం నియమించిన ఈ కమిటీ సిఫారసులను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. పోనీ.. అన్ని రాజకీయ పార్టీలను కూర్చోబెట్టి చర్చించి నిర్ణయం తీసుకున్నారా అంటే అదీ లేదు. ఏకపక్షంగా గుంటూరు జిల్లాలో రాజధాని అని ప్రకటించేశారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంది కాబట్టి తీర్మానం పాస్ చేశారు. అయితే బాబు అమరావతిపైనే పట్టుబట్టడం వెనుక ఉన్నది కుల రాజకీయమేనన్న విమర్శలు అప్పట్లోనే చాలా వచ్చాయి. 

ఇప్పుడు ఆ మాట ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేనే అంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ కులం ప్రాధాన్యం ఎక్కువ. రేపు అమరావతి రాజధాని అయితే హైదరాబాద్ తరహాలోనే అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరుగుతాయి. వాటిపై టీడీపీకే పట్టు ఉంటుందన్నది బాబు వ్యూహంగా చెబుతారు. ఇప్పుడీ వాదనను టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి కామెంట్లు నిజం చేశాయి. 

ఆంధ్రా రాజధాని ఎంపిక కుల సమీకరణ ఆధారంగానే జరిగిందని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు. అలా కాకుంటే.. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులనే పరిగణనలోకి తీసుకుని ఉండేవారని ఆయన కామెంట్ చేశారు. ప్రకాశం జిల్లాలో పెడితే వైసీపీకు ప్లస్ పాయింట్ అవుతుందని ఆ పార్టీ నేతలు భావించిన సంగతి తెలిసిందే. అంటే రెడ్డి సామాజిక వర్గంపై పైచేయి కోసమే అమరావతిని రాజధాని చేశారన్న విమర్శలకు ప్రభాకర్ రెడ్డి కామెంట్లు బలం చేకూర్చాయన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: