ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాముడికి వంద కోట్లు నజరానా ఇచ్చారు.. ఎవరా రాముడు.. ఏ పార్టీ వాడు.. వందకోట్లు ఇచ్చేయడంలో ఏమైనా రాజీకీయం ఉందా.. అని ఆలోచించకండి.. ఎందుకంటే ఆ రాముడు నాయకుడు కాదు.. దేవుడు.. కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువుదీరిన కోదండరాముడు.  ఆ ఆలయ అభివృద్ధి కోసం టీడీపీ నుంచి వంద కోట్ల సాయం ఒంటిమిట్ట రామాలయానికి అందిస్తున్నారు.  

మన దేశంలో రామాలయం లేని ఊరు ఉండదని ప్రతీతి. కానీ తెలుగునాట రామాలయం అంటే ముందుగా గుర్తుకొచ్చేది భద్రాచలమే. మరికొన్ని విశిష్ట ఆలయాలున్నా వాటికి రావలసినంత ప్రాచుర్యం లభించలేదనే చెప్పాలి. అలాంటి వాటిలో మొదటిది కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రాచలానికి దీటుగా ఈ ఒంటిమిట్టలో కల్యాణోత్సవం జరిపిస్తుటం వల్ల ఒంటిమిట్ట వెలుగులోకి వచ్చింది. 

భద్రాచలానికి దీటుగా ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతోనే టీటీడీ 100 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో మొదటి విడతగా 20 కోట్లు విడుదల చేస్తారట. శ్రీరామనవమి నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించారట. అన్నట్టు ఒంటిమిట్ట రామాలయానికి ఘన చరిత్ర ఉంది. ఆ ఘన చరిత్రను వివరించే అనేక శాసనాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ గుడి, చెరువు నిర్మాణాలకు ఆదేశాలిచ్చినట్టు చరిత్ర చెబుతోంది. 

గుడి తయారైన తర్వాత విజయనగర చక్రవర్తి బుక్కరాయలు సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్ర విగ్రహాన్ని నిలిపిన శాసనాలు ఇంకా ఉన్నాయి. ఒంటిమిట్ట ఆలయానికి అనేక ప్రత్యేకతలూ ఉన్నాయి. ఇక్కడ రాత్రిపూటే శ్రీరామ కల్యాణం జరగడం విశేషం. ఒంటిమిట్ట రామునిపై బమ్మెర పోతన వంటి కవులు కవిత్వం రాశారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్టను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకోవడం మెచ్చుకోవాల్సిన విషయమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: