చరిత్ర కనీవినీ ఎరుగని వరద దాడికి గురైన చెన్నయ్ దుస్థితి మనసున్న ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది. చెన్నయ్‌ నగరాన్న జలరాశి ముంచెత్తిందన్న వార్తలు రాగానే శోకాలు పెట్టి సోషల్ మీడియాలో ఏడుపు గొట్టు సందేశాలతో సరిపెట్టుకున్న మహా నటులు కొందరయితే, ఎందుకొచ్చిన వరదలు బాబూ అని తిట్టుకుంటూ తప్పనిసరి కాబట్టి ఇవ్వలేక ఇచ్చిన నటులు కొందరు. కోట్ల రూపాయలు నటన పేరుతో కొల్లగొడుతూ అసలేమాత్రం చలించని వారు కొందరు. టీవీల్లో చెన్నయ్ మహానగరం మునిగిపోయిన దృశ్యాలు, లక్షలాది మంది ప్రజల ఆకలి కేకలు విని చలించి పోయి ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి ఏది వీలయితే దాన్ని సేకరించి వివిధ రాష్టాల నుంచి వాహనాలతో తరలించుకుని వెళ్లి తమవంతు సాయం దొడ్డమనసుతో చేసి వచ్చిన సామాన్యులు కొందరు.

 

కానీ చెన్నయ్ వరద ముంపు మరో సెక్షన్ ప్రజలను కూడా కదిలించింది. కొన్ని వందల మైళ్ల దూరంలో తోటిమానవులు ప్రకృతి ఆగ్రహం ముందు చేష్ట్యలుడిగిపోయిన దృశ్యం చూసి తట్టుకోలేకపోయిన వీరు తమకు చేతనైన మొత్తాన్ని తమకే సాధ్యమైన రీతిలో సేకరించి వరద బాధితులకు పంపించారు. ఆ సహాయం పంపినందుకు వారు పెద్ద పెద్ద ప్రకటనలేం చేయలేదు. టీవీల ముందుకు మీడియాముందుకు వచ్చి ఫోజులివ్వలేదు.

 

ఒకపూట మాత్రమే తిండి తిని తద్వారా పోగయిన లక్ష రూపాయల చిరు మొత్తాన్ని వారు వరద బాధితులకోసం పంపారు. పేరుకోసం, ప్రతిష్టలకోసం గొప్పలకు పోకుండా మానవత్వాన్ని ఉద్దీప్తం చేస్తూ ఆదర్శమే తల వంచుకునేలా వారు చేసిన ఈ దాతృత్వం ఈ ప్రపంచం మరువలేని ఒక మహా మానవీయ పరిమళాన్ని చరిత్రకు అందించింది. సమాజంతో ఎంతో హీనభావంతో చూడబడుతూన్న వీరు సైలెంటుగా తాము చేసే పని చేసి  ఊరకుండిపోయారు.

 

వారు చాలా గొప్పవాళ్లు కాదు. సంపదలు కూడబెట్టిన వారు కాదు. భద్రజీవులు కారు. మహారాష్ట్రకు చెందిన సెక్స్ వర్కర్లు. ప్రతి రోజూ తమ శరీరాలను మగాళ్లకు అర్పిస్తే తప్ప పూట గడవనివారు... అంతో ఇంతో కూడబెట్టుకున్న పొదుపులను సేకరించారు. అదీ సరిపోదనుకున్పప్పుడు ఒక పూట భోజనం మాత్రమే స్వీకరించి అలా పస్తు ఉండి మిగిల్చిన డబ్బును కూడా దానికి కలిపి మొత్తం లక్ష రూపాయలను చెన్నయ్ సహాయం కోసం పంపారు.

 

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలో 3 వేలమంది సెక్స్ వర్కర్లు ఉంటున్నారు. వీరిలో కొందరు తమ పొదుపులను, ఒంటి పూట భోజన ద్వారా మిగిల్చిన మొత్తాన్ని కలిపి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.  దాదాపు 2 వేలమంది సెక్స్ వర్కర్లు ఒకటై ఈ దాతృత్వానికి పూనుకున్నారు.

 

చెన్నయ్‌లో వరద బీభత్సం గురించి విని కదిలిపోయిన ఈ సెక్స్ వర్కర్లు చెన్నయ్ వాసులకు తమ చేతనైన సాయంచేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పంతోనే వారు పొదుపులు, పస్తు రూపంలో సేకరించిన డబ్బును కలెక్టర్‌కు అందించారని స్నేహాలయ సంస్థకు చెందిన గిరీష్ కులకర్ణి తెలిపారు.

 

ప్రతి క్షణం తమ శరీరాన్ని పరిచి మరీ కూడబెట్టిన మొత్తాలను తీసి ఇవ్వడానికి 2 వేలమంది సెక్స్ వర్కర్లు ఏమాత్రం తటపటాయించలేదు. కేవలం లక్ష రూపాయలు వారి పంపించగలిగారు. డబ్బుతో కొలవలేని ఆ దాతృత్వం బరువు హిమాలయాలంత.


మరింత సమాచారం తెలుసుకోండి: