తక్కువ శక్తివంతమైన ఆంటంబాంబు తయారీని దాటుకుని అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును అభివృద్ధి పరచామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ అన్ చేసిన ప్రకటన పాశ్చాత్య దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును తయారు చేసిందంటే అనుమానమే అంటున్న అమెరికా ఆ దేశం ఎప్పటికైనా ప్రమాదకరమేనని స్పష్టం చేసింది. ఉత్తర కొరియాకు అంత సీన్ లేదని అంటున్న ప్రకటన అమెరికా ప్రకటన మేకపోతు గాంభీర్యం లాగా కనిపిస్తున్నదని, నిజానికి అమెరికా కూడా ఈ బాంబు వార్తల విషయంలో భయపడుతున్నదని పలువురు భావిస్తున్నారు.

 

దేశంలోని ప్యోంగ్యోన్ రివల్యూషనరీ సైట్‌ను సందర్శించి తన  తాత, ఉత్తర కొరియా నిర్మాత కిమ్ ఇల్ సంగ్‌కు నివాళి పలికిన సందర్భంగా కిమ్ జోంగ్ మాట్లాడుతూ కిమ్ ఇల్ సంగ్ చేసిన కృషి ఫలితంగానే ఉత్తర కొరియా అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ ఆయుధాలను కలిగిన దేశంగా అవతరించిందని ప్రకటించారు. దేశ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకోసం స్వయం కృషితో తయారు చేసిన అణుబాంబు, హైడ్రోజన్ బాంబులను పేల్చడానికి తమ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని కిమ్ పేర్కొన్నారు.

 

హైడ్రోజన్ బాంబును థెర్మోన్యూక్లియర్ బాంబుగా కూడా పిలుస్తారు. ఇది ఆంటంబాంబు కంటే మించి శక్తివంతమైన పేలుడును సృష్టించే అత్యధునాతన సాంకేతిక శక్తిని కలిగి ఉంటుంది. 2006, 2009, 2013 సంవత్సరాల్లో అణ్వాయుధాల రూపకల్పన కోసం ఉత్తర కొరియా భూగర్భ పరీక్షలను జరిపింది. దీంతో ఉత్తర కొరియా ఆయుధ తయారీ కార్యక్రమానికి సహకరించే వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలు విదించింది.

 

అయితే ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసిందంటే సందేహమేనని అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి జోస్ ఎర్నెస్ట్ కొట్టిపడేశారు. ఉత్తర కొరియా ప్రకటనను విశ్వసించలేమని కానీ అణ్వయుధాలను అభివృద్ది చేయాలనే ఆకాంక్షను కలిగిన దేశంగా ఉత్తరకొరియా ప్రపంచానికి ప్రమాదహేతువేనని అమెరికా హెచ్చరించింది. ఉత్తర కొరియా అంతర్జాతీయ విధివిధానాలకు కట్టుబడి, తన అణ్వాయుధాలను అన్నింటినీ త్యజించాలని అమెరికా పిలుపునిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: