వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమెపై టీడీపీ నేతల దాడి ఆగడం లేదు. తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం టీడీపీ నేతల వైపు నుంచి కొనసాగుతూనే ఉంది. రోజా అసెంబ్లీలో బరితెగించి ప్రవర్తిస్తున్నారని.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడంలో ఏమాత్రం తప్పులేదని.. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతే కాదు.. రోజా కోసం వైసీపీ అధినేత జగన్ కూడా దిగజారి ప్రవర్తిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే సభను జరగనివ్వబోమని జగన్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ జనం కోసం ఉన్నారా.. కేవలం ఒక్క రోజా కోసమే ఉన్నారా అని కామెంట్ చేశారు. అంతే కాదు.. రోజాపై పోలీసులు రౌడ్ షీట్ కూడా తెరవాలని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

రోజా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే ఊరుకోబోమని సోమిరెడ్డి హెచ్చరించారు. అంతవరకూ బాగానే ఉంది.. ఆ తర్వాత సోమిరెడ్డి ప్రెస్ మీట్ దారితప్పినట్టు కనిపించింది. ఆన్ ది రికార్డు మాట్లాడిన తర్వాత.. ఆయన విలేఖరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. రోజాపై వ్యక్తిగతంగా దూషించారట. రోజాకు సన్నని నడుము ఉందని ఎలా పడితే అలా గెంతుతానంటే ఊరుకుంటామా అని కామెంట్ చేశారట. 

సోమిరెడ్డి రోజాను ఇంకో వివాదంలోకి కూడా లాగినట్టు తెలుస్తోంది. రోజా సభలో మేమేమైనా దళితులమా అని కామెంట్ చేసిందని సోమిరెడ్డి అన్నారట. రోజా దృష్టిలో దళితులు హీనమైన వాళ్లా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించినట్టు సమాచారం. దళితులను కించపర్చిన రోజా వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఆఫ్ ద రికార్డు అని చెప్పిన తర్వాత అలాంటి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు సీనియర్ జర్నలిస్టులు.


మరింత సమాచారం తెలుసుకోండి: