ఆంద్రప్రదేశ్ రెవెన్యూ లోటు రాష్ట్రమని ఎవరు చెప్పారు? ఇలా చెప్పినవారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పెడుతున్న ఖర్చుల జాబితాను చూస్తే షాక్ తినడం ఖాయం. ప్రత్యేక విమానాలు, విదేశీ యాత్రలు, హైదరాబాద్‌లోని సచివాలయంలో, విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన అధికార మందిరంలో వాస్తుకు అనుగుణంగా చేస్తున్న మార్పులను చూస్తే ఏపీ గురించిన తమ అభిప్రాయాలను ఎవరైనా మార్చుకోవలసిందే.


వీటిపై ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు, ఇప్పుడు గుంటూరులోని తాడెపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంలోని తన అతిధి గృహం మరమ్మతులను చేపట్టారు. కృష్ణానది గట్టుపై ఉన్న లింగమనేని అతిథి గృహంలో బాబు నివసిస్తున్నారు. కాగా అధికార బాధ్యతలను మాత్రం విజయవాడ నుంచి నిర్వహిస్తున్నారు. ఈ అతిథి గృహానికి బాబు ఇప్పటికే వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరమ్మతులు, భద్రతా ఏర్పాట్లు, అతిథి గృహం ముందు ప్రత్యేక హెలిపాడ్ ఏర్పాటు వంటి వాటికి ఇంత డబ్బును ఖర్చుపెట్టినట్లు సమాచారం.   
అతిథి గృహం చుట్టూ కొత్త రోడ్లు, ఫూల్-ప్రూఫ్ ఏర్పాట్లు, తదితర సౌకర్యాలను కల్పించారు. ఇది ప్రైవేట్ గెస్ట్ హౌస్ అయినప్పటికీ ఇంత మొత్తం ఖర్చు పెట్టడం గమనార్హం. ఈ అతిథి గృహం ఇప్పటికీ ప్రైవేట్ యజమానుల చేతిలో ఉంది. దీనిపైనే ప్రభుత్వం వందకోట్లు ఖర్చుపెట్టడం షాక్ కలిగిస్తోంది. 


ఈ ప్రైవేట్ అతిథి గృహాన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ స్వాధీనం చేసుకోలేదు. చంద్రబాబు తన అధికారిక నివాసాన్ని నూతన రాజధాని అమరావతికి మార్చుకున్నట్లయితే (నిర్మాణం పూర్తయిన తర్వాత) అది ఈ అతిథి గృహ యజమానులుకు అనేక ప్రయోజనాలు కలిగించనుంది. జిల్లాలోనే ఏ భవంతిలోనూ లేనన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఈ భవంతిలో ఉంటాయి కాబట్టి బాబు ఖాళీ చేసి వెళ్లాక ఈ భవనం దాని ప్రేవైట్ యజమానులకు ఇచ్చే లాభాలు అపారమని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: