ఆకస్మికంగా పాకిస్తాన్ లోని లాహోర్‌లో అడుగుపెట్టి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి భారత ప్రధాని అందించిన బహుమతి తన విలువను సార్థకం చేసుకున్నట్లయింది. ఆదివారం తన మనవరాలి పెళ్లి సందర్భంగా షరీఫ్, తనకు మోదీ ఇచ్చిన బహమతి గులాబీ తలపాగాను ధరించి ఆహుతుందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. భారత ప్రధాని శుక్రవారం తనకు బహుకరించిన రాజస్తానీ గులాబీ రంగు తలపాగాను షరీఫ్ తన ఇంట వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలో ధరించి మోదీ బహుమతి గౌరవాన్ని పెంచారు.

 

మోదీ ఇచ్చిన తలపాగాను ధరించడమంటేనే తన పొరుగు దేశం పట్ల పాక్ ప్రధాని షరీఫ్ ఎంత చిత్తశుద్ధితో ఉంటున్నారన్నది రుజువవుతోందని షరీఫ్ పార్టీ అయిన పీఎంఎల్-ఎన్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా మోదీ బహుమతికి షరీఫ్ ఎంత విలువనిచ్చారన్నది కూడా ఇక్కడ స్పష్టమవుతోందని వారన్నారు. 

 

షరీఫ్ మనవరాలు మెహరున్నీసా సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త చౌదరి మునిర్ కుమారుడు రహీల్ మునీర్ పెళ్లి ఆదివారం లాహర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం లాహోర్‌లో షరీఫ్ ఇంటిముందుకు మోదీ రాగానే ఆయనతో చేతులు కలిపిన తొలివ్యక్తి చౌదరీ మునీర్ కావడం గమనార్హం. 2 వేలమంది అతిధులు హాజరైన ఆ వివాహ వేడుకకు సౌదీ అరేబియానుంచి కూడా అతిథులు వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: