నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. మరి అంత వెటకారం పనికిరాదు కానీ.. ఈయన మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది కదా.. అందుకే ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోవడం కాస్త కష్టమే. ఒకటా, రెండా ఏకంగా రెండు సంవత్సరాలపాటు కిరణ్ కుమార్ రెడ్డి మీడియా గొట్టలకు చిక్కకుండా తప్పించుకున్నారు. జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. ఘోరంగా ఓడిపోయారు. అంతే అటు తర్వాత పత్తా లేకుండా పోయారు. 

పేరుకు ఆయన మాజీ సీఎమ్మే కానీ వయసు మాత్రం చాలా తక్కువ. ఇంకా బోలెడంత భవిష్యత్ ఉంది. అందుకే జాగ్రత్తగా రాజకీయ అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైందని అన్నా.. ఎందుకనో అది వర్కవుట్ కాలేదు. చాలా కాలం తెరవెనకే ఉండిపోయిన ఈ మాజీ ముఖ్యమంత్రి అకస్మాత్తుగా మీడియా గొట్టాలకు కనిపించి పండుగ చేశారు. 

రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ కు చెందిన విద్యాసంస్థల రజతోత్సవానికి హాజరైన నల్లారి ఈసారి మాత్రం మీడియా గొట్టాల నుంచి తప్పించుకోలేకపోయారు. కాస్త మొహమాటంగానే మీడియా గొట్టాల ముందుకు వచ్చిన నల్లారి.. తన మునుపటి ఫామ్ మాత్రం తగ్గించలేదు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలను బాగానే ఎండగట్టారు. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించా అనకుండా గణాంకాలతో సహా లెక్కలు అప్పగించారు.  

కాంగ్రెస్ హయాంలో ఇళ్లు మంజూరై ఆ తర్వాత నిధులు మంజూరు కాక దాదాపు 6 లక్షల ఇళ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయని కిరణ్ చంద్రబాబుకు గుర్తు చేశారు. దాదాపు  70 లక్షల మంది రైతులు తాము తీసుకున్న రుణాలకు ఏడాదికి 14 శాతం వడ్డీకడుతున్నారని వివరించారు. చివరకు మహిళా సంఘాలను కూడా మోసం చేశారన్నారు. 

ఇక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, బంగారు తల్లి చట్టం వంటి వాటి సంగతి పట్టించుకునే నాథుడేలేడని కిరణ్ కూల్ గానే పాయింట్ లాగి వాయించారు. అంతేకాదు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏకమై కృష్ణా, గోదావరి నదుల పంపకాలపై పోరాడకపోతే.. రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. అమరావతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఎద్దేవా చేశారు. మొత్తం మీద అనుకోకుండా మీడియా ముందుకొచ్చినా.. నల్లారి బాగానే అప్ డేట్ లో ఉన్నారు సుమా.


మరింత సమాచారం తెలుసుకోండి: