వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల వాతావరణ ఇప్పటినుంచే వేడెక్కడం అక్కడ మొదలైంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి కూటమిగా పోటీచేయబోతున్నట్లు, డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించడం విశేషం. అదే సమయంలో ఆయన మాజీ సినీస్టార్‌, రాజకీయ నాయకుడు విజయకాంత్‌ను కూడా తమ కూటమితో కలిసి రావాలని ఆహ్వానించడం మరో కీలక పరిణామంగా గమనించాల్సి ఉంది.

 ఇదివరకు కూడా యూపీఏ కూటమిలో కరుణానిధి భాగంగానే ఉన్నారు. తన కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టిన తరువాత.. కరుణానిధి డీఎంకే పార్టీ యూపీఏ కూటమినుంచి వైదొలగింది. అయితే అలా కొన్నాళ్లు నడిపించిన తరువాత.. ప్రస్తుతం తమిళనాట నెలకొని ఉన్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో.. తమకు ఎవరో ఒకరి సహకారం ఉంటే తప్ప.. నెగ్గుకురావడం అసాధ్యం అని కరుణానిధికి అనిపించిందో ఏమో గానీ.. మళ్లీ ఆయన కాంగ్రెసు పంచన చేరుతున్నారు. నిజానికి కాంగ్రెసుకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బలం తక్కువే. కాకపోతే.. ఇద్దరూ కలిస్తే.. జయలలితను ఓడించవచ్చుననేది వారి ఆలోచన కావొచ్చు.

 అదే సమయంలో విజయకాంత్‌ను కూడా కరుణానిధి ఆహ్వానించడం విశేషం. జయలలిత మీద అలుపెరగకుండా పోరాడుతున్న వారిలో విజయకాంత్‌ కూడా ఉన్నారు. తాజాగా కూడా ఓ సందర్భంలో విలేకర్ల మీద.. జయలలితను ప్రస్తావించి విజయకాంత్‌ నిప్పులు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంతో ఇంతో బలం ఉన్న పార్టీలన్నీ కలిపి జయలలితను ఓడించడానికి ఒక్కటవుతున్నారు. వీరు ఎంత మేర సక్సెస్‌ అవుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: