కేసీఆర్.. ఈ మూడక్షరాల పదం.. కోట్ల మందిని ఉర్రూతలూగిస్తే.. మరి కొన్ని కోట్ల మంది గుండెల్లో అగ్గి రాజేసింది. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టడానికి ప్రధాన కారణంగా చరిత్రలో నిలిచిపోయాడు కేసీఆర్. ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాక పరిస్థితి బాగానే ఉంది కానీ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇరు ప్రాంతాల నేతలు ఒకరినొకరు తిట్టుకోవడం విమర్శించుకోవడం ఓ రేంజ్ లో ఉండేవి. 

తెలంగాణవారికి ఆంధ్రావారు ద్రోహులుగా కనిపించేవారు.. ఆంధ్రావారికి తెలంగాణవారు ద్రోహుల్లా కనిపించేవారు. అయితే తెలంగాణవారికి ఎందరో ఆంధ్రానేతలు విలన్లుగా కనిపిస్తే.. ఆంధ్రావారికి కనిపించిన ఒకే ఒక్క విలన్ కేసీఆర్. కేసీఆర్ పై సమైక్య ఉద్యమ కాలంలో వెలసిన్ని వ్యతిరేక ఫ్లెక్సీలు ఇంకా ఏ నాయకుడిపైనా వచ్చి ఉండవు. అంతగా ఆంధ్రా జనంలో కేసీఆర్ పట్ల విద్వేషం అప్పట్లో ఉండేది. 

కానీ ఇప్పుడు సీన్ మారిపోయిందా.. ఆంధ్రావారు కూడా తెలంగాణ సీఎం పట్ల ఆకర్షితులవుతున్నారా.. కేసీఆర్ వ్యవహారశైలి, పాలనారీతులు ఆంధ్రావారిని కూడా ఆకర్షిస్తున్నాయా.. అంటే అవుననే అంటోంది ఎన్టీవీ సర్వే. ఆంధ్రాజనం అంటే ఏపీలో ఉండే జనం కాదు కానీ.. హైదరాబాద్ లో ఉండే సీమాంధ్రులు మాత్రం  కేసీఆర్ పాలన అంటే తెగ ఇష్టపడుతున్నారట. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరు ఎలా  ఉందని ఎన్టీవీ సర్వేలో అడిగితే.. గ్రేటర్ హైదరాబాద్ ఈస్ట్‌ జోన్‌లో 11శాతంమంది  చాలా బాగుందని, 60 శాతం మంది బాగుందని,  24శాతం పరవాలేదని అన్నారట. కేవలం 3 శాతం మాత్రమే బాగోలేదని అన్నారట. అదే గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జోన్‌ విషయానికి వస్తే.. 15శాతం చాలా బాగుందని 49 బాగుందని, 28 శాతం పర్వాలేదని చెప్పారట. 

అన్నింటికంటే కీలకమైనే సీమాంధ్రులు ఎక్కువగా ఉండే అంటే శేరి లింగం పల్లి, కూకట్‌ పల్లి, కేపీహెచ్ బీ లాంటి ప్రాంతాలుండే వెస్ట్ జోన్‌ లో మాత్రం 75 శాతం మంది కేసీఆర్ పని తీరు అదుర్స్ అన్నారట. 22 శాతం బావుందంటే.. 3 శాతం మాత్రమే బాగోలేదన్నారట. అంటే సీమాంధ్రులు కూడా కేసీఆర్ పాలన పట్ల ఆకర్షితులవుతున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: