ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకూ అనేక జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపిస్తోంది. ఏదో ఒక సారి అంటే పెద్దగా పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ.. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం జనాల్లో భయందోళనలకు కారణమవుతోంది. 

భూ ప్రకంపనలకు తోడు.. ఆ మధ్య కడప జిల్లాల్లోని పలు గ్రామాల్లో భూమి ఉన్నట్టుండి కుంగిపోయింది.. ఒక ఇల్లు ఉన్నపళంగా భూమిలోకి కుంగిపోయేంత లోతు గుంతలు ఏర్పడ్డాయి. వీటిని నిపుణులు, అధికారులు కూడా వచ్చి పరిశీలించారు. అసలేంజరుగుతోంది.. ఇన్నిజిల్లాల్లో ఎందుకు కంపనాలు వస్తున్నాయి.. ఈ వరుస ఘటనలు దేనికి సంకేతం అన్న ఆందోళనలు పలు జిల్లాల్లో కనిపిస్తున్నాయి. 

భూకంపనలు, భూమి కుంగిపోవడంతో పాటు.. కొన్ని జిల్లాల్లో భూమి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే గత మూడు నెలల వ్యవధిలో ఇలా భూప్రకంపనలు రావడం, పెద్ద శబ్దాలు రావడం దాదాపుగా ఇది పదోసారి. మంగళవారం కూడా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజక వర్గంలో వరుస భూప్రకంనలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.

వరికుంటపాడు,దుత్తలూరు మండలాలలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. యితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. నెల్లూరు జిల్లాలో సంభవించినవి స్వల్ప భూకంపాలేనని..వాటితో వచ్చిన ముప్పేమీ లేదని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ అధికారులు చెబుతున్నారు.

ఈ జిల్లాలో మూడు నెలల వ్యవధిలో 5 చిన్న భూకంపాలు సంభవించాయని వివరిస్తున్నారు. భూమి లోపల ఫలకాల ఘర్షణ వల్ల ఇవి సంభవిస్తుంటాయని అంటున్నారు. అద్దంకి, శ్రీకాళహస్తి భూకంప కేంద్రాలకు సుమారు వంద నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: