పరకాల ప్రభాకర్.. ఈయన ఆంధ్రా ప్రభుత్వ మీడియా సలహాదారు అన్న సంగతి తెలిసిందే. కానీ ఆయన చాలాసార్లు .. తన పదవికి మించి ప్రవర్తిస్తుంటారు. ఆయన భార్య నిర్మలాసీతారామన్ కేంద్ర మంత్రి కావడంతో ఆయన ఓవర్ యాక్షన్ ను ఏపీ సర్కారు భరించాల్సి వస్తుందన్న కామెంట్లు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. వాటిలో వాస్తవం లేకపోలేదు.

ఏపీ సర్కారు ఏర్పడిన మొదట్లో పరకాల ఓవరాక్షన్ ఇంకా ఎక్కువ ఉండేదని.. ప్రస్తుతం ఆయన్ను బాబు అంతగా పట్టించుకోవట్లేదని కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇక పరకాల పనైపోయినట్టేనని కూడా వదంతులు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే పరకాల హైదరాబాద్ లో ఉండిపోవడం, సీఎం విజయవాడకు షిఫ్టు కావడం వంటి పరిణామాలతో పరకాల హవా ముగిసినట్టే అనిపించింది.

కానీ అలాంటిదేమీ లేదని సీఎం దావోస్ పర్యటనతో వెల్లడవుతోంది. ఈ పర్యటనలో పరకాల ప్రభాకర్ కు కూడా అవకాశం లభించింది. ఈ పర్యటన గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు రావాలి కాబట్టి ఆయన్ను కూడా తీసుకెళ్లి ఉండొచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పరకాల విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు పర్యటన వివరాలను మీడియాకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. 

అంతవరకూ బాగానే ఉంది. దావోస్ లో చంద్రబాబు ఎవరితో భేటీ అయినా ఆ సమావేశం ఫుటేజీని సెక్రటేరియట్ నుంచి అన్ని ఛానళ్లకూ పంపిస్తున్నారు. సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు. అయితే అక్కడితో ఆగకుండా పరకాల ప్రభాకరే స్వయంగా ఓ రిపోర్టర్ లాగా దావోస్ వీధుల్లో తిరుగుతూ సీఎం పర్యటన వివరాలను వెల్లడించడం ఆశ్చర్యం కలిగించింది. 

మహా అయితే ఓ ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీ అలా కాకుండా.. తానే ఓ రిపోర్టర్ తరహాలో పరకాల ఫీలై రిపోర్టింగ్ చేయడం ఓవరాక్షనే అని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాబు దగ్గర పవర్ తగ్గినా ఈ ఓవరాక్షన్ మాత్రం తగ్గలేదని గొణుక్కుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: