ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ అంటే.. గంటల తరబడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆదివారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ మీటింగులో చంద్రబాబు మంత్రుల పని తీరుపైనా సమీక్ష జరిపినట్టు తెలిసింది. ప్రత్యేకించి కొందరు మంత్రులకు బాగానే క్లాస్ పీకేశారట. మరికొందరినేమో బాగా పని చేస్తున్నారంటూ మెచ్చుకున్నారట. మరి ఇంతకీ బాబుతో అక్షింతలు వేయించుకున్న మంత్రులెవరు.. మెప్పు పొందిన మొనగాళ్లెవరు..?

ప్రత్యేకించి ఇద్దరు మంత్రులకు ఈసారి హైడోస్ లో క్లాస్ పీకారట చంద్రబాబు. పౌరసరఫరాల శాఖ అధికారులపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారట. సంక్రాంతి కానుక సరుకుల పంపిణీ వ్యవహారం, సరుకల నాణ్యతపై ఆయన ఫుల్లుగా మండిపడినట్లు తెలిసింది. తన పేరు చెడగొట్టేలా చేశారని.. మూడు నెలల ముందే పథకం ప్రకటించినా.. సరైన నాణ్యత ఉన్న వస్తువులను సేకరించలేదని.. పంపిణీ కూడా సక్రమంగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారట.

అలాగే.. రాజధాని భూముల్లోని రోడ్ల విషయంలో కొందరు మంత్రులు చేసిన ప్రకటనలపై చంద్రబాబు సీరియస్ అయ్యారట. ముఖ్యంగా రైతుల కోరిక మేరకు రహదారుల అలైన్ మెంట్ మారుస్తామని హామీ ఇవ్వడంపై బాబు సీరియస్ అయ్యారట. ఎవరిని అడిగి ఆ ప్రకటన చేశారని మండిపడ్డారట. రైతులు కోరినట్టల్లా రోడ్లు అలైన్ మెంట్ మారిస్తే.. పరమ దరిద్రంగా ఉంటుందని పెట్టుబడులు రావని మండిపడ్డారట.

అలాగే.. అందరికంటే.. విద్యుత్, జలవనరులు, ఆర్ అండ్ బీ శాఖ పనితీరు బాగుందని మెచ్చుకున్నారట. అలాగే తరచూ బాబుతో అక్షింతలు వేయించుకునే సీనియర్ మంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రం ఈసారి అనూహ్యంగా ప్రశంసలు పొందారట. మూడేళ్ల నుంచి కొలిక్కి రాని రెవెన్యూ వ్యవహారాలను కేఈ ఓ దారికి తెస్తున్నారంటూ చంద్రబాబు మెచ్చుకున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: