మేం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటాం.. మీరు మాత్రం ఇక్కడే ఉండాలనుకుంటారు.. అక్కడకు రారు.. ఇదీ ఓ నాగార్జున సినిమాలో బ్రహ్మానందం డైలాగ్.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సేమ్ డైలాగ్ చెబుతున్నారు. కాకపోతే ఆ సినిమాలో బ్రహ్మానందం దురుద్దేశంతో ఆ డైలాగ్ చెబితే.. ఇక్కడ చంద్రబాబు మాత్రం ఆవేదనతో చెబుతున్నారు..

అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రపంచ పటంలో పెట్టాలన్నది చంద్రబాబు స్వప్నం. దాన్ని సాకారం చేసేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. దేశ, విదేశాలు  తిరుగుతున్నారు. ప్రపంచంలో అమలవుతున్న అత్యున్నత ప్రమాణాలు తెలుసుకుని వాటిని అమరావతిలో అమలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు ఇలాంటి తపన చూపుతుంటే.. ఇక్కడి ఏపీ అధికారులు, మంత్రులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ చంద్రబాబు నోట బ్రహ్మానందం డైలాగ్  వచ్చేలా  విసిగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మాణానికి కావల్సిన స్ఫూర్తిని కొనసాగించడంలో మంత్రులు, అధికారులు ఫెయిలవుతున్నారని బాబు తెగ ఫీలవుతున్నారట.  మంత్రులు, నేతలు పొంతన లేని ప్రకటనలు చేస్తూ కొత్త తలనొప్పులు తెస్తున్నారన్నది బాబు ఫిర్యాదు.

అమరావతిలో రోడ్ల విషయంలో మంత్రులు, అధికారులు తలోమాటా మాట్లాడారు. అవసరమైతే రోడ్ల అలైన్ మెంటు మారుస్తామని నారాయణ వంటి మంత్రులు చెప్పారు కూడా. దీనిపైనే బాబు  తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. గ్రామస్తులు అభ్యంతరం చెబితే, రహదారుల్ని గ్రామాల పక్క నుంచి వేస్తామని ప్రకటనలు చేసిన మంత్రులకు ఆయన ఫుల్లుగా క్లాసు పీకారట కూడా.

అందుకే ఇక వీళ్లను నమ్ముకుంటే లాభం లేదనుకున్న బాబు త్వరలోనే స్వయంగా రంగంలో దిగుతారట. గ్రామస్తులను స్వయంగా ఒప్పిస్తారట. పాపం అధికారులు, మంత్రులు బాబు లెవల్ కు ఎప్పుడు ఎదుగుతారో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: