ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎంను పట్టించుకోవడం మానేశారా.. ఆంధ్రాపై నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తున్నారా.. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పలుకుబడి తగ్గిపోయిందా.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కేంద్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నా.. ఆశించినంత స్థాయిలో నిధులు రాష్ట్రానికి రావడం లేదన్న అసంతృప్తి ఇప్పటికే ఏపీ జనంలో ఉంది. 

దీనికి తోడు.. కరవు సాయం వంటి విషయాల్లో ఏపీని బొత్తిగా పట్టించుకోడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రీసెంటుగా విపత్తు సాయంలో మరోసారి ఏపీకి కేంద్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. 2000 కోట్ల వరకూ నష్టం వచ్చింది సాయం చేయండి మహా ప్రభో అంటే అందులో కేవలం 280 కోట్లు మాత్రమే మిగిల్చి చేతులు దులుపుకుంది కేంద్రం. 

ఆంధ్రాలో నవంబర్, డిసెంబర్లలో సంభవించిన భారీ వర్షాలు భారీగా పంటనష్టానికి కారణమయ్యాయి. జనం కూడా పెద్ద ఎత్తున నిరాశ్రయులయ్యారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో పలు రహదార్లకు గండ్లు పడడంతో పాటు చేతికి వచ్చిన పంట పూర్తిగా పాడవడం పెను నష్టానికి కారణమైంది. విపత్తు నివారణ తక్షణ చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాలను పంపిణీతో పాటు, తాత్కాలిక సాయం అందజేసింది. 

కేంద్రం నుంచి కనీసం రూ 700 కోట్లయినా వస్తాయని ఏపీ ఆశలు పెట్టుకుంది. కానీ కేవలం 280 కోట్లతో కేంద్రం సరిపెట్టింది.  మన పొరుగున తమిళనాడురాష్ట్రానికి ఇదే నెలలలో కురిసిన వర్షాలకు రూ. 1800 కోట్లు సాయం అందించారు. రాజస్థాన్, అస్సాం లకూ విపత్తు సాయం భారీగానే అందింది. గతంలో హుద్ హుద్ విషయంలోనూ ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: