ఏపీ సీఎం చంద్రబాబుపై సాక్షి పత్రిక దాడి మరింతగా తీవ్రం చేసింది. ఆ మధ్య కొన్ని రోజులు జోరు తగ్గించిన ఈ జగన్ పత్రిక.. ఇటీవలి వైసీపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో వాడి వేడి పెంచేసింది. తాజాగా విజయవాడలో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న భవనం అక్రమమైనా దాన్ని సక్రమం చేసేందుకు అధికారులు, మంత్రులు నానా తంటాలుపడుతున్నారంటూ సంచనల కథనం ప్రచురించింది. 

ప్రస్తుతం సీఎం నివాసంగా ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్ కృష్ణానది కరకట్టపైన ఉంది. ఈ భవనంతో పాటు చుట్టుపక్కల పలు భవనాలు.. కరకట్టను ఆక్రమించి కట్టినవని గతంలో అధికారులే నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. వీరికి నోటీసులు ఇవ్వాలంటూ గతంలో మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారట. మంత్రులు నారాయణ, పుల్లారావులు కూడా పూలింగ్‌లో ఈ భవనాలున్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారట. 

ఈ భవనాన్ని సక్రమం చేసేందుకు చంద్రబాబు, ఆయన టీమ్ చాలా కసరత్తే చేశారని సాక్షి ఆరోపిస్తోంది. సీఎం నివాసం సమీపంలోనే మరో భవనాన్ని ఆయన తనయుడు లోకేశ్ తన నివాసంగా ఎంచుకున్నారు. ఈ భవనాల ఆధునికీకరణ కోసం కోట్ల రూపాయల సర్కారు సొమ్ము ఖర్చు చేశారు. అనుమతిలేని కట్టడానికి మెరుగులు దిద్దేందుకు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుపెట్డడానికి నిబంధనలు ఒప్పుకోవు. 

అందుకే ఈ భవనాలను క్రమబద్దీకరించుకున్నారట. కేవలం సీఎం నివాసమే కాకుండా అదే కరకట్ట దిగువన ఉన్న అనధికార కట్టడాలు కూడా క్రమబద్ధీకరణ అయ్యాయట. సీఎం నివాసం కోసం చేసిన మార్పులతో మొత్తం 22 భవనాలు సక్రమం అయ్యాయట. పెద్దల విలాస భవనాల కోసం మినహాయింపులు ఇచ్చిన అధికారులు.. పేదల ఇళ్లకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదట. 



మరింత సమాచారం తెలుసుకోండి: