ఆంధ్రాలో చంద్రబాబు సర్కారు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇది ఎవరూ ఊహించని ఆకస్మక నిర్ణయం. కనీసం ఎలాంటి లీకులూ లేకుండా.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దగా చర్చ కూడా అప్పటికప్పుడు చంద్రబాబు ఏకపక్షంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 

ఇసుకను నిత్యావసరాల చట్టం కిందకు ఇసుకను తీసుకొస్తూ అందరికీ ఉచితంగా సరఫరా చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఆకస్మక నిర్ణయం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇలాంటి నిర్ణయం అసలు ఎందుకు తీసుకున్నారు. ఇది ఎవరికి లాభం చేకూరుస్తుంది. ప్రజలు ఈ నిర్ణయంతో ఆనందంగా ఉంటారా.. దుర్వినియోగం కాకుండా ఆపగలరా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 

చంద్రబాబు వాదన ప్రకారం.. డ్వాక్రా సంఘాలకు ఇసుక రేవులు, వేలం పాటలు ఇలా విధానంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా సర్కారుకు చెడ్డ పేరు తప్పటం లేదట. ఇసుక వ్యవహారాల కోసం పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని మోహరించాల్సి వస్తోందట. ఇంత చేసినా సర్కారుకు ఏడాదికి కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోందట. 

ఆ మాత్రం 200 కోట్ల కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకని చంద్రబాబు భావించారట. ఈ ఆదాయం కోసం జీపీఎస్ పద్ధతి, సీసీ కెమెరాలు పెట్టడం, పెద్ద స్థాయిలో అధికారులను నియమించటం వంటివి అవసరం లేకుండా ఇసుకను ఉచితం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది కదా అని సీఎం అన్నారట. చంద్రబాబు నిర్ణయాన్ని మంత్రులు కూడా ముక్తకంఠంతో అంగీకరించారట. 

ప్రభుత్వం కొత్త నిర్ణయం ప్రకారం ఇకపై ఆంధ్రాలో నిర్మాణ పనులన్నింటికీ ఇసుకను ఉచితంగా ఇస్తారు. రవాణ ఖర్చు మాత్రం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ఐతే.. ఏపీలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఈ ఇసుక వ్యాపారం చేస్తున్నారు. దీనిపై గతంలో ఈనాడు పత్రిక కూడా సర్కారు తీరును ఏకిపారేస్తూ కథనాలు ప్రచురించింది. ఇలా చెడ్డపేరు తెచ్చుకోవడం కంటే.. పార్టీ నాయకుల కోసం సర్కారుకు వచ్చే 200 కోట్లు త్యాగం చేయడమే మంచిదన్న నిర్ణయానికి బాబు వచ్చారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: