దేశంకాని దేశంలో ఏదో నాలుగు రాళ్లు సంపాదించు కుందామన్న ఆశతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగు వారి పరిస్థితి దయనీయంగా మారింది. పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన మనవాళ్లు ఇప్పుడు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. విజిట్ వీసాలపై వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ఏళ్లతరబడి అక్కడ ఉన్నారన్న నేరం కింద యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో వేల మంది తెలుగువారు మగ్గిపోతున్నారు. కంపెనీ వీసాలపై వెళ్లి వారికి కూడా సరైన జీతాలు లేక పాస్ పోర్టులు లేక నరకం అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల యూపిఏ ప్రభుత్వం మన రాష్ట్రానికి చెందిన 20 వేల మందికి క్షమాభిక్ష పెట్టింది. 2013 ఫిబ్రవరి ౩లోపు దేశం విడిచి వెళ్లాలని లేదంటే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. దీంతో అక్కడే ఉండలేక... ఇటు సొంత ఊరికి వచ్చేందుకు తగినంత ఆర్థిక స్థోమత లేక కాలం వెల్లదీస్తున్న గల్ఫ్ బాధితులు ఇంటికి చేరేందుకు డబ్బులు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మన దేశం నుంచి దాదాపుగా 50 వేల మంది గల్ఫ్ దేశాల్లో వలసకార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే మన పొరుగు రాష్ర్టాలు కేరళ, తమిళనాడు ఆ రాష్ట్ర బాధితుల్ని కాపాడుకునేందుకు విమాన టికెట్లు కూడా అందిస్తోంది. అయితే మన రాష్ట్రం మాత్రం వీరి గురించి పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినా స్పందించలేదని ఇటీవల కేంద్ర మంత్రి వయలార్ రవి స్వయంగా ప్రకటించారు. ఇందులో తన తప్పేమీ లేదని... ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంస్థలో దాదాపు 1200 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని... ఆ నిధుల్లోంచి కొంత మొత్తాన్ని గల్ఫ్ బాధితుల్ని రాష్ట్రానికి రప్పించేందుకు ఖర్చు చేయాలని గల్ఫ్ భాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: