ఒక అక్షరం మనిషిని విద్యావంతున్ని చేస్తుంది. ఒక అక్షరం మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. ఒక అక్షరం వెయ్యి క్షిపణులకంటే విలువైనది. ఒక అక్షరం మనిషిజీవితాన్నే మార్చేస్తుంది. ప్రస్థుతం మన తెలుగు రాష్ట్రాల్లో అక్షరాస్యతా శాతం అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉంది. సగం మునిగిన నావలా ఇటు మునగలేక అటు తేలలేక నడి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో అక్షరాస్యత 65 శాతానికి కాస్త అటో ఇటో అంతే. మరి మిగతా 35 శాతం పరిస్థితి ఏంటి? మనమెందుకు సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేక పోతున్నాం? బడికెల్లాల్సిన ఎన్నో చేతులు బరువులు ఎందుకు మోస్తున్నాయి? ప్రభుత్వం కళ్ళు ముసుకుపోయాయా? లోపం ఎవరిలో ఉంది? ప్రభుత్వంలోనా లేక వ్యవస్థలోనా?


ఈ పాపాన్ని ప్రభుత్వాలు, ప్రజా వ్యవస్థలు సరిసమానంగా పంచుకున్నాయి. లోపం రెండింటిలోనూ ఉంది. మన తెలుగు రాష్ట్రాలు విద్యావ్యవస్థను ప్రాథమికవిద్య, మాధ్యమికవిద్య, ఉన్నత విద్యలుగా విభజించాయి. ఒక్కొక్క విభాగంలో పుట్టల కొద్దీ సమస్యలున్నాయి. ప్రభుత్వాలు ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రవేశపెట్టినా అవి సంపూర్ణంగా అమలవ్వట్లేదు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చుచేసినా అవినీతి రాజకీయ నాయకులు, అధికారులు పందికొక్కుల రూపంలో వాటిని మేస్తున్నారు. అంతేకాక బడికెల్లాల్సిన వయస్సులో బరువులు మోస్తున్న బాల కార్మికులు లక్షల్లోనే. ఒకవేళ బడికెల్లినా మధ్యలో మానేసేవారి సంఖ్య కూడా అధికమే. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి గల కారణాలేంటి?


ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకోని, చదువు పట్ల అయిష్టతతో కొన్నివేలమంది తల్లి దండ్రులు తమ పిల్లల్ని బడికి పంపట్లేదు. ప్రస్తుత పాశ్చ్యాత్య నాగరికతకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. పాఠశాల ఉపాధ్యాయుల లోటు కూడా నిత్యసమస్యగా మారింది. సర్వశిక్షా అభియాన్ సంపూర్ణంగా అమలవ్వట్లేదు. నిశితంగా పరిశీలించినట్లయితే పదోతరగతి తర్వాత ఇంటర్మీడియట్లోకి ప్రవేశించేవారి సంఖ్య సగానికి పడిపోయింది. మాధ్యమిక విద్యలో కూడా ఉత్తీర్ణులయ్యేవారు కేవలం 50 శాతమే. ఇక ఉన్నత విద్యగురించి చెప్పనే అక్కర్లేదు. ఇందులో రోజుకో సమస్య తలెత్తుతుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయాలు ఆనేక అరాచక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. మన తెలుగురాష్ట్రాల్లో పి హెచ్ డీ చేయాలంటే ఋషిని మించిన తపస్సు చేయాల్సిందే. మన తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణ అక్ష్యరాస్యత సాధించిన గ్రామాలెన్ని? అక్షరాస్యత అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలి?


విద్య ఒక సామాజిక అంశం. ఏ ఒక్కరితోనో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం కాదు. తెలుగు రాష్ట్రాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే అందులో రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాల్లో నిపుణుల భాగస్వామ్యం అత్యావశ్యకం. తల్లిదండ్రులందరు తమ పిల్లల్ని బడికి పంపడంలో చోరువ చూపాలి. ఉపాధ్యాయులు కూడా తమ విధ్యార్థులని సంపూర్ణ అక్షరాస్యులుగాతీర్చిదిద్దాలి. ప్రభుత్వం విద్యా సమస్యలన్నింటినీ నిపుణులచే పరిష్కరించాలి. ప్రతి పౌరుడు నిత్య విద్యార్థిగా కొనసాగాలి. అప్పుడే సంపూర్ణ అక్ష్యరాస్యత సాధ్యమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: