తెలంగాణకు గుండెకాయ లాంటి గ్రేటర్ హైద‌రాబాద్ కు అభివృద్ది పై దృష్టి కేంద్రీక‌రించింది గులాబీ స‌ర్కార్. అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మంటూ ప‌లు ప్రాజెక్టుల‌కు రూప క‌ల్ప‌న చేస్తోంది. అయితే ప్రభుత్వం పూర్తిచేయాలనుకుంటున్న ఈ ప‌నుల‌న్నింటికీ వేల కోట్ల రూపాయలు అవ‌సరమవుతాయి. ఇందుకోసం భారీగా నిధుల స‌మీక‌ర‌ణ‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల త‌లుపు త‌ట్టేందుకు సిద్ద‌మైంది. ప్ర‌ధానంగా హుస్సేన్ సాగర్ ప్ర‌క్షాళ‌న‌, మూసీ సుంద‌రీక‌ర‌ణ‌, స్కైవేల నిర్మాణం, ఎక్స్ ప్రెస్ వేలు, బెంగ‌ళూర్ త‌ర‌హా స‌మ‌గ్ర రోడ్ల నిర్మాణం, గ్రీన‌రీ డెవ‌ల‌ప్ మెంట్, ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌నులు పూర్తి చేయ‌డంతో పాటు శివారు ఏరియాల్లో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయం, మంచినీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ ను ఆధునీక‌రించే చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇటీవ‌లే మున్సిఫ‌ల్ శాఖ బాద్య‌తలు చేప‌ట్టిన క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు హైద‌రాబాద్ అభివృద్దికి త‌న‌దైన శైలిలో పాల‌న‌ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టారు.


అయితే కొత్త‌గా ప్ర‌భుత్వం  చేప‌ట్టిన ప‌థ‌కాల‌కు నిధుల లేమి కొట్టొచ్చినట్లు క‌నిపిస్తోంది. రోడ్ల స‌మ‌గ్రాభివృధ్ధికి 26 వేల కోట్లు, హ‌స్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న‌కు 500 కోట్లు, మూసీన‌ది సుంద‌రీక‌ర‌ణ‌కు 3 వేలకోట్లు, మూసీ న‌ది ఒడ్డు మీదుగా సిక్స్ లైన్ రోడ్ల నిర్మాణానికి 6,500 కోట్లు అవ‌స‌ర‌మ వుతాయని స‌ర్కార్ అంచ‌నా వేసింది. ఒక వైపు ఆదాయాన్ని పెంచుకోవ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకంటూనే మ‌రో వైపు వివిధ ఆర్థిక  సంస్థ‌ల నుంచి అప్పులు తీసుకోవాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. రోడ్  డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రాంకు బ్రిక్స్ బ్యాంకు ద్వారా హుస్సేన్ సాగర్ ప్ర‌క్షాళ‌న కు ఆస్ట్రియా నుంచి మూసీ క్లీనింగ్ మరియు బ్యూటిఫికేష‌న్ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా డ‌బ్బు అప్పుతీసుకు నేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 


ఇక‌పోతే... వాట‌ర్ బోర్డు, హెచ్ఎండీఏ సంస్థ‌లు చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌లేని దుస్థితి లో ఉన్నాయి. స్వావ‌లంబ‌న‌తో ఉన్న జీహెచ్ఎంసీ ఇప్ప‌టికే ప‌లు ఆర్థిక భారాలు  మోస్తోంది. ఆర్టీసీ,వాట‌ర్ బోర్డుకు చెల్లిస్తున్న నిధులే గాక... తాజాగా హైద‌రాబాద్  మెట్రోరైల్ భూసేక‌ర‌ణ భారం కూడా జీహెచ్ఎంసీ పై మోపేందుకు ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది. మ‌రోవైపు సిటీలో నిర్మించ‌త‌ల‌పెట్టిన ల‌క్ష డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల‌కు 17 వేల కోట్లు అవ‌స‌రం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ప‌లు భారీ ప్రాజెక్టుల‌ను త‌ల‌కెత్తుకున్న నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కార్ నిధుల అన్వేష‌ణ లో ప‌డింది. గులాబీ ద‌ళం  ఆశ‌ల ప‌థ‌కాలు నెర‌వేరుతాయో లేదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: