తెలుగు దేశం నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల అంశం ఓ కొలిక్కి వచ్చింది. వారిని ఇకపై టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇన్నాళ్లూ ఆ సభ్యులపై అనర్హత వేటుపై విచారణ జరుగుతూ ఉందంటూ చెబుతూ వచ్చిన తెలంగాణ స్పీకర్.. ఇప్పుడు మొత్తం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇకపై సాంకేతికంగా టీఆర్ఎస్ సభ్యులైపోయినట్టు ప్రకటించేశారు. 

ఇందుకు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖను ఆయుధంగా మలచుకున్నారు. ఓ పార్టీకి చెందిన 15 మంది సభ్యుల్లో 12 మంది తాము మరో పార్టీలో విలీనమవుతామని లేఖ ఇచ్చినందువల్ల వారి అభ్యర్థనను మన్నించామని తెలంగాణ స్పీకర్ చెబుతున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జనరల్ గా స్పీకర్ దే తుది నిర్ణయం అవుతుంది. 

ఐతే.. తెలంగాణ స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ చెబుతోంది. లండన్ వెళ్లేందుకు ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే డైలాగ్ ఉపయోగించారు. ఒక పార్టీ సభ్యులను మరో పార్టీలో విలీనం చేసేందుకు స్పీకర్ కు అధికారాలు లేవని రేవంత్ అంటున్నారు. అది కేవలం ఈసీ అధికారం మాత్రమేనంటున్నారు. 

మరి ఈ విషయంలో రేవంత్ న్యాయపోరాటం ఫలిస్తుందా. ఈసీ ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది. ఇప్పటివరకూ  శాసనసభ వ్యవహారాల్లో స్పీకర్ దే తుది నిర్ణయంగా వస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది. ఒకవేళ తెలంగాణ స్పీకర్ నిర్ణయాన్ని ఈసీ, కోర్టులు తప్పుబడితే అప్పుడు పరిస్థితి ఏంటి .. అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. 

అప్పటివరకూ టీడీపీ సభ్యులు టీఆర్ఎస్ సభ్యులుగానే చెలామణీలో ఉంటారు. వాస్తవానికి ఈ ఇష్యూలో మరోసారి స్పీకర్ అధికారాలపై చర్చకు ఆస్కారం ఏర్పడింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్పీకర్ అధికారాలు కొందరి రాజకీయ క్రీడలకు పావులవుతున్నాయన్న వాదనపై మరించ చర్చకు ఆస్కారం ఏర్పడింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: