ఓ కాంట్రాక్టు ఇప్పించడం కోసం ఓ మంత్రి ఎంత లంచం తీసుకుంటాడు.. 2 పర్సంటో, ఫైర్ పర్సంటో ఉంటుంది.. మరి ఆ ఫైవ్ పర్సంట్ వ్యాల్యు ఎంత ఉంటుందనేది ఆ కాంట్రాక్టును బట్టి ప్రాజెక్టును బట్టి ఉంటుంది. మహా అయితే కోటో, రెండు కోట్లో ఉండొచ్చు. కానీ ఓ మంత్రి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా కాంట్రాక్టులు ఇప్పించి ఏకంగా 900 కోట్ల రూపాయల వరకూ లంచంగా మింగేశాడట. 

మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రులు సాగించే అవినీతి దందాలకు ఓ ప్రత్యక్ష ఉదాహరణగా మారింది.  మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ను లంచాల ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు అరెస్టు చేశాయి. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ నిర్మాణంతో పాటు అనేక కాంట్రాక్టుల కోసం ఈయన దాదాపు రూ. 870 కోట్లు లంచాలు  తీసుకున్నాడట. 

మరి ఇంత మొత్తం ఇన్ కం ట్యాక్స్ లెక్కలకు దొరకకుండా ఎలా తప్పించుకోవడం. అందుకే ఈ సొమ్మును సూట్ కేసు కంపెనీల తరహాలో విదేశాలకు పంపించి.. అక్కడి నుంచి పేపర్ కంపెనీల ద్వారా మనదేశంలోకి పెట్టుబడుల రూపంలో రప్పించారు. బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఇదో మార్గం. అలా భుజ్ బల్ కుటుంబ సభ్యులు పేపర్ పై సృష్టించిన ఓ కంపెనీ ఆర్మ్ స్ట్రాంగ్ పైనా ఈడీ విచారణ జరుపుతోందట. 

ఛగన్ భుజ్ బల్ పై వచ్చిన ఆరోపల్లో ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించగానే ఈడీ ఓ పద్దతి ప్రకారం దాడులు చేసింది. భుజ్‌బల్ అన్న కొడుకు సమీర్ భుజ్‌బల్‌ను గత  ఫిబ్రవరి 1వ తేదీనే అరెస్టు చేశారు. ఛగన్ కొడుకు పంకజ్‌ను కూడా అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. ఆ తర్వాత నాసిక్, ముంబై, థానేలోని భుజ్‌బల్, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లపై దాడులు చేశారు. భుజ్‌బల్‌ను కూడా విచారించారు. 

ఐతే.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపే అంటున్నారు ఎన్సీపీ నేతలు. కష్టకాలంలో తాము భుజ్ బల్ కు అండగా నిలుస్తామంటున్నారు. మరి భుజ్ బలపై వచ్చిన ఆరోపణలను ఈడీ, సీబీఐ రుజువు చేయగలుగుతాయా.. ఆయనకు శిక్ష పడేలా చేయగలుగుతాయా.. అన్నది సస్పెన్స్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: