ఈ 2013వ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పెద్ద సవాల్ లాంటిది. పార్టీని నడిపించాల్సిన నాయకుడు జైలుకెళ్లడంతో... రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్సీపీ నేతలు ఈ ఏడాదైనా తమ ప్రియతమ నేత వైఎస్ జగన్ జైలు నుంచి విడుదల అవుతారని కళ్లకు ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే 2012 మే నెలలో అరెస్టైన జగన్... బయటకు వచ్చేందుకు ఎన్నిసార్లు బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అక్రమ ఆస్తులు, క్విడ్‌ ప్రోకో కేసులో జగన్ ను సీబీఐ తొలి ముద్దాయిగా చార్జ్ షీట్ లో నమోదు చేసింది. ఆ తర్వాత కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా విచారణ మొదలు పెట్టింది. ఈడీ జగన్ కు చెందిన కొన్ని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది. బెయిల్ కోసం జగన్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ప్రయత్నించినప్పటికీ మోక్షం లభించడం లేదు. పుట్టినరోజు వేడుకల్ని కూడా జైల్లో జరుపుకొన్న జగన్... న్యూ ఇయర్ వేడుకలను కూడా జైలు గోడల మధ్యే జరుపుకున్నారు. జగన్ దాఖలు చేసిన స్టాట్యూటరీ బెయిల్ కొట్టేసినప్పటికీ...  రెగ్యులర్ బెయిల్ పై జనవరి నాలుగో తేదీ విచారణ జరగనుంది. అయితే అదే సమయంలో మార్చి చివరి నాటికి జగన్ కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇది వైఎస్ ఆర్ సీపీ నేతల్లో కొంత ఆశలను రేకెత్తిస్తోంది. జనవరి 4న గాని.. మార్చిలో గానీ తమ ప్రియతమ నేత జగన్ బయటకు రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే తమను కాంగ్రెస్, టీడీపీ నేతల ఒత్తిడితోనే సీబీఐ అక్రమంగా అరెస్ట్ చేసిందని... జగన్ ను విడుదల చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మొత్తానికి ఈ ఏడాదైనా జగన్ కు జైలు నుంచి విముక్తి కలుగుతుందని ఆశా భావంతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. మరి వారి ఆశ నెరవేరుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: