వైసీపీ ఎమ్మెల్యే రోజా విషయంలో న్యాయ, శాసన వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రోజా సస్పెన్షన్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినా దాన్ని అసెంబ్లీ స్పీకర్ అమలు చేయలేదు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండానే అప్పీలుకు వెళ్లింది ఏపీ అసెంబ్లీ. దీంతో ఈ రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తినట్టైంది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ గతాన్ని గుర్తు చేశారు. 

గతంలో ఈనాడు అధినేత, సంపాదకుడు రామోజీరావు విషయంలోనూ ఇలాగే న్యాయ, శాసన వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తిందని గుర్తు చేశారు ఆర్కే.. ఆ వివరాలు ఓసారి చూద్దాం.. ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో శాసన మండలిలో జరిగిన ఓ ఘటనపై ఈనాడు ‘పెద్దల సభలో గలభా’ అన్న శీర్షికతో ఒక వార్తను ప్రచురించిందట. ‘పెద్ద’ అన్న రెండు అక్షరాలను కోట్స్‌లో పెట్టడం ద్వారా తమను అవమానించారని, గేలిచేశారని మండలిలో మెజారిటీగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు ఫీలయ్యారని ఆర్కే తన వ్యాసంలో గుర్తు చేశారు.  

దీంతో శాసనమండలి సభ్యులు రామోజీరావుపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారట. రామోజీరావు సభకు వచ్చి వివరణ ఇచ్చుకోవాలని శాసనమండలి ఆదేశించిందట. రామోజీ ఈ ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారట. తమ ఆదేశాలపై స్టే ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు లేదని ఫీలైన శాసనమండలి రామోజీని అరెస్టు చేసి సభకు తీసుకురావాలని అప్పటి హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కె.విజయరామారావుకు ఆదేశాలు జారీచేసిందట. 

రామోజీ అరెస్టు కోసం వెళ్లిన విజయరామారావుకు ఆయన నుంచి సహాయ నిరాకరణ ఎదురైందట. నేను స్వయంగా రాను.. బలవంతంగా తీసుకెళ్లాలంటే మీ ఇష్టం అన్నారట రామోజీ.. అదీ ఆయన ధైర్యానికి ఓ ఉదాహరణగా చెబుతారు. ఇంతలో సుప్రీంకోర్టు ఆయన్ను అరెస్ట్‌ చేయకుండా స్టే ఇచ్చింది. పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి జవాబుదారీ కాబట్టి.. రామోజీ అరెస్టు కాలేదు. చివరకు శాసన మండలే వెనక్కు తగ్గిందట. ఈ వివాదం కారణంగానే ఆ తర్వాత ఎన్టీఆర్ శానస మండలిని రద్దు చేశారని చెబుతారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: