మన రాజకీయాల్లో ఆశ్రిత పక్షపాతం పాలు చాలా ఎక్కువ. ఒక్కడికి పదవి దక్కిందంటే చాలు.. వాడు.. వాడి కుటుంబం, బంధువులు అంతా ఆ పదవి తమదే అనుకుంటారు. పైరవీల జోరు మొదలెట్టేస్తారు.. వాడు మావాడే. మనం  ఎంత చెబితే అంత.. నీకు అది ఇప్పిస్తా.. ఇది ఇప్పిస్తానంటూ లంచాలు బొక్కడం మొదలుపెడతారు. లక్షలు, కోట్లు నొక్కేస్తారు. 

వీరి సందడి చూసిన కొందరు కంత్రీగాళ్లు తాము కూడా ఫలానా వాళ్ల బంధువులమే అంటూ కటింగులు ఇవ్వడం మొదలుపెడతారు. అమాయకులు దొరికితే చాలు.. మీ పని మేం చేసిపెడతామంటూ డబ్బు గుంజడం మొదలుపెడతారు. రీసెంటుగా తమిళనాడు గవర్నర్‌ రోశయ్య దగ్గరి బంధువుని అంటూ అమాయక ప్రజలను మోసగిస్తున్నమీనయ్య గుప్తా అనే ఓ ఘరానా మోసగాడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ మీనయ్య గుప్తాను చూస్తే ఎవ్వరూ మోసగాడు అనుకోరు. ఎందుకంటే అంతటి విలాసవంతమైన జీవితం గడుపుతాడు. హైసెక్యూరిటీ జోన్ లోనే నివాసం ఉంటాడు. ప్రముఖ క్రీడాకారిని సానియా మీర్జా ఇంట్లో అద్దెకు ఉన్నాడు. నెల అద్దె లక్షన్నర అయినా డోంట్ కేర్ అంటాడు. తమిళనాడు గవర్నర్‌ రోశయ్యతో దిగిన ఫోటోలు చూపించి బోల్తా కొట్టిస్తాడు. 

మనకు తెలియని వాళ్లు లేరంటూ ఉద్యోగాలు ఇట్టే ఇప్పిస్తానంటాడు. లక్షలకు లక్షలు గుంజుతాడు. ఓ బాధితుడు తన కొడుక్కు ఎస్సై ఉద్యోగం కోసం 40 లక్షల వరకూ ఈ గుప్తాకు సమర్పించుకున్నాడు. మరి కొందరికి తమిళనాడు మెడికల్ సీట్లు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర పది లక్షల వరకూ గుంజాడు. 

ఇలా మనోడి చిలక్కొట్టుడు లెక్కబెడితే పాతిక కోట్లు దాటిందట. ఇతనికి ఇల్లు అద్దెకు ఇచ్చిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఇతని చేతిలో మోసపోయిందట. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటూ.. ఆ ఇంటినే అమ్మకానికి పెట్టేశాడీ ప్రబుద్దుడు. ఆ తర్వాత తప్పైపోయిందని ఒప్పుకున్నాడట.   



మరింత సమాచారం తెలుసుకోండి: