అక్రమాస్తుల కేసులో జగన్ మెడ చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోందనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలు చార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్న విషయమూ తెలిసిందే. ఇప్పుడు ఉన్న కేసులు చాలవన్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో చార్జ్ షీట్ దాఖలు చేసింది. సాక్షి పత్రిక మాతృ సంస్థ జగతిలోకి రామ్ కీ సంస్థ పెట్టుబడులు  మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధంగా జరిగాయని తేల్చింది. 

ఈ కేసులో జగన్, విజయ్ సాయిరెడ్డి, రాంకీ గ్రూపు ప్రతినిధి అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాంకీ సంస్థ జగతిలో పది కోట్లు పెట్టుబడి పెట్టిందని.. అందుకు ప్రతిఫలంగా వైఎస్ సర్కారు నుంచి ఆ గ్రూపు అధినేత అయోధ్య రామిరెడ్డి దాదాపు 134 కోట్ల రూపాయల అక్రమ లబ్ధి పొందారని సీబీఐ తేల్చింది. 

సీబీఐ ఇచ్చిన వివరాల ఆధారంగా విచారణ జరిపిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుమారు 346 కోట్ల రూపాయల రాంకీ గ్రూపు ఆస్తులను జప్తు చేసేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ముడుపులను పెట్టుబడులుగా చూపించడంలో ఆడిటర్ విజయ్ సాయిరెడ్డి ప్రధాన పాత్ర పోషించారని ఈడీ ఆరోపించింది. జగతిలో పది కోట్లు పెట్టుబడి పెట్టి రాంకీ సంస్థ.. విశాఖలోని ఫార్మా సిటీలో అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది.

ఈ ఫార్మా సిటీలో పచ్చదనం కోసం వాస్తవానికి 973 ఎకరాలు వదలాల్సి ఉంది. ఐతే.. సాక్షిలో 10 కోట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల కేవలం 58 ఎకరాలు మాత్రమే వదిలిసినా సర్కారు కావాలనే పట్టించుకోలేదట. అలా మిగిలిన భూమిని అమ్ముకోవడం వల్ల అయోధ్య రామిరెడ్డికి 133 కోట్ల 74 లక్షల రూపాయల ఆయాచిత లబ్ధి పొందినట్లు ఈడీ తేల్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: