మోడీ సర్కారు మరోసారి పెట్రో వాత పెట్టేసింది. లీటరు పెట్రోలు ఈసారి రూ.2.19 పైసలు పెరిగింది. డీజిల్ విషయానికి వస్తే.. లీటరు రెండు పైసలు తక్కువ రూపాయి పెరిగింది. ఈ పెరుగుదల సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చేసింది.  పెట్రో ధరలు పెరిగి 15 రోజులు కూడా కాకముందే మరోసారి వాత పెట్టడం నిజంగా వినియోగ దారులకు షాకే.

ఆ పెరుగుదల కూడా రూపాయి, అర్థరూపాయి కాకుండా ఏకంగా 2 రూపాయలు, మూడు రూపాయిలు పెంచుకుంటూ పోతున్నాయి ఆయిల్‌ సంస్థలు. ఇటీవల మార్చి 17న పెట్రోలుపై రూ.3.07, డీజిలుపై రూ.1.90 పెంచారు. అంతకుముందు ఫిబ్రవరి 16 న పెట్రో ధరలు పెరిగాయి. అంటే నెలన్నర సమయంలోనే మూడుసార్లు పెట్రో ధరలు పెరిగాయన్నమాట. 

పెట్రో ధరలను అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా సవరించే విధానం అమల్లోకి వచ్చాక పెట్రో ధరల పెంపు ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ విధానం రాకముందు రూపాయి పెట్రో ధరలు పెంచితేనే ధర్నాలు, రాస్తారోకోలు, బందులు జరిగేవి. ఇప్పుడు పెట్రో ధరలను ఒక అలవాటుగా మార్చేసిన ఘనత మాత్రం మన్మోహన్ సర్కారుదే. 

అయితే మోడీ ఏలుబడి వచ్చాక అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ధరలు దారుణంగా పడిపోయినా.. దానికి అనుగుణంగా పెట్రో ధరలను తగ్గించడం లేదు. ఆ తేడా కవర్ చేసేలా ఎక్సైజ్ సుంకాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది మోడీ సర్కారు. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా సవరిస్తున్నాం అని చెప్పుకుంటున్నా.. తగ్గించేటప్పుడు పైసల్లో.. పెంచేటప్పుడు రూపాయిల్లో ఈ సవరణ ఉండటాన్ని జనం అర్థం చేసుకుంటూనే ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: