ఆంధ్రప్రదేశ్ నకిలీ నోట్ల డంపింగ్ యార్డుగా మారిపోతోందా.. మన చేతిలో ఉన్న వంద నోట్లకట్టలో నాలుగో అయిదో నకిలీ నోట్లేనా.. పాకిస్తాన్ లో ముద్రించిన కరెన్సీని మనదేశంలోకి డంప్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ను వేదికగా మార్చుకుంటున్నారా.. ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానమే వస్తోంది. శనివారం విజయవాడ పోలీసులు బయటపెట్టిన నకిలీనోట్ల ముఠా వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.   

అంతర్జాతీయంగా నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న 13 మంది సభ్యుల ముఠాను విజయవాడ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మన పొరుగు దేశం పాకిస్థాన్ లో ముద్రించిన రూ.500, రూ.1000 నకిలీ ఇండియన్ కరెన్సీని బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌ మీదుగా ఏపీకి తరలిస్తున్న తీరును పోలీసులు వివరించారు. మొత్తం 13 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 

వీరి నుంచి రూ.8 లక్షల విలువైన నకీలీ నోట్లు, రూ. 50 వేల విలువైన అసలునోట్లు, 16 సెల్‌ఫోన్లు, 3 మోటరుసైకిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వేశాఖ ఉద్యోగులతో వీరు సంబందాలు పెట్టుకుని రైళ్ల ద్వారా పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని పాకిస్తాన్ నుంచి ఏపీలోకి డంప్ చేస్తున్నారు. ఈ నకిలీ ముఠాకు రైల్వే మాజీ ఉద్యోగి ఆకుల వెంకటదుర్గా శేషుబాబు సహకరించినట్టు తెలిసింది. 

తప్పుడు ప్రవర్తనతో గతంలోనే  రైల్వే ఉద్యోగం పోగొట్టుకున్న ఇతడిపై గతంలోనూ పలు నేరాలు నమోదయ్యాయి. చాలా మందికి రైల్వే ఉద్యోగాలను ఇప్పిస్తానని టోపీపెట్టాడు. గతంలో జైలుకు కూడా వెళ్లాడు. అక్కడే దొంగనోట్ల చెలామణీ వ్యవహారం గుట్టుమట్లు ఓ నేరస్తుడి ద్వారా తెలుసుకున్న శేషుబాబు జైలు నుంచి బయటికొచ్చాక  పశ్చిమబెంగాల్‌కు చెందిన ముఠాతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో పలువురు జర్నలిస్టులకూ సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: