జపాన్‌లో భూప్రకోపం సృష్టించిన విషాదం నుంచి తేరుకోకముందే.. దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌ను భారీ భూకంపం కుదిపేసింది. శనివారం అర్ధరాత్రి 7.8తీవ్రతతో వచ్చిన  భూకంపం పెను విషాదమే నింపింది. దాదాపు నిమిషంపాటు భూమి కంపించగా.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పెను భూకంపం ధాటికి 235 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

భారీ భూకంపం కారణంగా ఈక్వెడార్ లో పెద్దసంఖ్యలో ఇళ్లు, వంతనెలు కూలిపోయాయి. వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. దాదాపు 2 వేల మందికి పైగా గాయపడ్డారు. మరికొన్ని వేల మంది ఇంకా శిథిలాల కిందే ఉండిపోయారు. విపత్తు బారినపడ్డ ప్రజల్ని ఆదుకునేందుకు.. ఈక్వెడార్‌ ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. మాంటా, పోర్టోవీజో, గుయాక్విల్ నగరాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు.

వణికిపోయిన ఈక్వెడార్.. 


భూకంపం తర్వాత 55 సార్లు చిన్నపాటి ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని క్విటోకు వాయవ్య దిశలో 170 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తీవ్ర ప్రభావం చూపిన ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించింది. సైన్యం, పోలీసులు, ఇతర అత్యవసర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపి... శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈక్వెడార్ , కొలంబియా తీరాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. 

శిథిలాల కింద ఎందరో.. 


దాదాపు ఒక నిమిషం పాటు ఈక్వెడార్‌తోపాటు పెరూ ఉత్తర భాగం, కొలంబియా దక్షిణ ప్రాంతం కంపించింది. ఈక్వెడార్‌లోనే ఎక్కువ నష్టం చోటుచేసుకుంది. తీర పట్టణమైన గుయాక్విల్‌లో ఓ వంతెన కుప్పకూలింది. ఒక్క పెడెర్నాలస్ పట్టణంలోనే 400 మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పెడెర్నాలెస్ పట్టణంలోని వందలమంది రాత్రంతా ఆరుబయటే పడుకున్నారు. ఇంత విషాదంలోనూ కొందరు లూటీలకు పాల్పడటం మానవత్వానికే మచ్చగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: