రాజ‌కీయ పార్టీలు త‌మ త‌మ పార్టీ బ‌లోపేతానికి వివిధ పార్టీల నుంచి ఆక‌ర్షణ పేరుతో సీనియ‌ర్ నాయకుల‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తారు. గ‌తంలో ఎన్టీఆర్ నుంచి నేటి కేసీఆర్ వ‌ర‌కు ఇందులో ఏ పార్టీ అధినాయకుల‌కు మిన‌హాయింపు ఉండ‌దు. దేశంలో త‌మిళ‌నాటు ఆకర్ష‌ణ ప్ర‌భావం ఎక్కువ‌నే చెప్పాలి. త‌మిళ‌నాడు సీఎం జయల‌లిత తన పాల‌న‌లో ప్ర‌తిప‌క్షం లేకుండా చేశారు. ఇక తాజాగా ఈ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల మ‌రి కాస్త ముదిరిందంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు అధికార పార్టీ కండువా క‌ప్పుకొనేందుకు ఆతృత ప‌డుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిణామాల సంగ‌తి ప‌క్క‌న పెడితే... తెలంగాణ‌లో జంపింగ్ భ‌లేల ఆస‌క్తిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత‌ల పార్టీ పిరాయింపులు ఆస‌క్తినే కాకుండా విచిత్రంగా కూడా ఉన్నాయి.  దీనికి కారణం కాంగ్రెస్ నేత‌ల ప‌ద‌వుల ఆరాట‌మ‌ని తెలుస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో అధికార టీఆర్ఎస్ చేస్తున్న స‌రికొత్త ప‌న్నాగం లో ప్ర‌తిప‌క్షాలు నామ‌రూపం లేకుండా పోతున్నాయి. 


మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మీడియాతో చెప్ప‌డం ఆస‌క్తి !


ఇప్ప‌టికే, టీడీపీ బిచానా ఎత్తేసింది. బీజేపీ పార్టీ దాదాపుగా  టీఆర్ఎస్ మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హారిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం టీఆర్ఎస్ లో విళీనం దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ, స్వ‌త‌హాగా జాతీయ పార్టీ కావ‌డంతో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ కు కొంత ఇర‌కాటంగానే ఉన్నా... ఆ పార్టీ కి చెందిన కొంత మంది సీనియ‌ర్ నాయకులు పార్టీ మారే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే విష‌యం పై టీఆర్ఎస్ నేత‌, మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మీడియాతో చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. కాంగ్రెస్ నుంచి ఇంకొంద‌రు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. ప‌దేళ్ల పాటు మంత్ర  ప‌ద‌వులు అనుభవించిన కాంగ్రెస్ పార్టీలోని  సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు  ప్ర‌తిప‌క్షంలో కూర్చోడానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటాన‌ని మాట ఇస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు కొంత మంది సీనియ‌ర్ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ- వైఎస్ఆర్ సీపీ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన విష‌యం తెలిసిందే.


ఎమ్మెల్యే కాక‌పోయినా తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ను ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు త‌న మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు సైతం మంత్రి ప‌ద‌వి  అప్పగించారు. ప్ర‌స్తుతం ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ల‌కు ఇచ్చిన‌ట్టుగానే త‌మ‌కూ హామీ ఇస్తే గులాబీ కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మేన‌న్న సంకేతాలు  కాంగ్రెస్ లోని ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు అధికార పార్టీకి సంకేతాలు పంపిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు న‌ల్ల‌గొండ జిల్లాలో ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి- ఎమ్మెల్సీ కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇద్ద‌రూ ఎప్ప‌టి నుంచో టీఆర్ఎస్ నేత‌ల‌తో  ట‌చ్ లో ఉన్నారు.  ఆ విష‌యాన్ని  అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఆ ఇద్ద‌రు నేత‌లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కార్య‌క్ర‌మాల‌ను కొనియాడుతూ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ లో చేర‌డ‌మే ఆల‌స్య‌మ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వారిపై ఆశ వదులుకున్న‌ట్లు మీడియా అంత‌ర్గ‌త  చ‌ర్చ‌ల్లో కాంగ్రెస్ పార్టీ నేత‌లు వెల్ల‌డించారు. 


కాంగ్రెస్ లోని ఉంటామ‌ని ఆ ఇద్ద‌రు చెబుతున్నా వారి మాట‌ల మీద విశ్వాసం పోయింద‌న్న భావ‌న ఆ పార్టీలోనే వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. గులాబీ కండువా క‌ప్పుకోవ‌డానికి ముందు ఒక‌రికి కాంట్రాక్టు ప‌నులు, మ‌రొక‌రికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందు ష‌ర‌తు పెట్టిన‌ట్టు తెలిసింది. దానికి ముఖ్య‌మంత్రి స‌సేమిరా అన్నారని మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి వ్య‌తిరేకించార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. జానారెడ్డి కి హోం శాఖ ఇవ్వ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  వాటిని ఆయ‌న  మీడియా సాక్షిగా ఖండించారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళతామ‌ని చెబుతున్నారు త‌ప్ప అసెంబ్లీ లో ఆయ‌న ప్ర‌స్తావించ‌లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా చేరిక‌ల‌పై వార్త‌లను ఖండిస్తున్నారు. మెద‌క్ జిల్లాలోని సీనియ‌ర్ మంత్రిగా కొన‌సాగిన మ‌హిళా ఎమ్మెల్యే కారెక్క‌డ‌మే తరువాయి అని ప్రచారం జ‌రిగినా ఆమె  కూడా మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టికే ఆ జిల్లా నుంచి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్- మంత్రిగా హ‌రీశ్ రావు - డిప్యూటీ స్పీక‌ర్ గా ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ఉన్నారు.


అయితే మ‌రొక‌రికి ఇచ్చే అవ‌కాశం ఉండ‌ద‌ని తేల్చి చెప్పిన‌ట్టు తెల‌సింది. మాజీ మంత్రి  డీకే అరుణ కూడా మంత్రి ప‌ద‌విని ఆశించార‌ని కానీ ఆమెక‌కు మ‌హిళా కార్పొరేష‌న్ ప‌ద‌వి ఇవ్వడానికి  సీఎం కేసీఆర్ అంగీక‌రించార‌ని తెలిసింది. ఖ‌మ్మంలోని ఒక ఎమ్మెల్యే జంపింగ్ కు సిద్దంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా మ‌రో ఎమ్మెల్యేతో ఒక సీనియ‌ర్ మంత్రి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెల‌సింది. కొంత‌మంది మాజీలు ఎమ్మెల్సీ కావాల‌ని అడుగుతున్నారు. మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ కారెక్క‌డానికి సిద్ధ‌మై చివ‌ర్లో విరమిచుకున్న విష‌యం తెలిసిందే. ఎమ్మెల్సీ ప‌దవిపై స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో ఆయ‌న వెనుదిరిగిన‌ట్టు సమాచారం. పొన్నాల ల‌క్ష్మ‌య్య పైనా ప్ర‌చారం జ‌రిగినా ఆ వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. అయితే అధికార ప‌క్షం వైపు నుంచి గ్రీన్ సిగ్న‌ల్స్  వ‌చ్చిన వెంట‌నే ఆలాంటి ఖండ‌న‌లు గాలిలో క‌లిసిపోతాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. 


త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్- అరికెపూడి గాంధీ- వివేకానంద - చిట్టెం రామ్మోహన రెడ్డిల‌ను ఉదాహ‌ర‌ణ‌లుగా చూపిస్తున్నారు.  సీనియ‌ర్ల కంటే ముందుగా జూనియ‌ర్ల‌ను చేర్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపింద‌ని తెలుస్తోంది. ఆ తర్వాతే తిరిగి సీనియర్లే తమ గూటికి చేరతారని ధీమాతో ఉన్నారు. 2019లో తిరిగి తమ ప్రభుత్వమే తిరిగి వస్తుందని వారంతా తమ పార్టీలో చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మంత్రుల సంఖ్య కూడా పెరుగుతోందని చెబుతున్నారు. మొత్త‌మీద మ‌రోద‌పా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రానుంద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు భావిస్తున్నారు. మంత్రి ప‌ద‌వులు అశిస్తున్న నాయకులంతా  టీఆర్ఎస్ లోకి చేరిపోవ‌డం ఖాయంగా నే క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: