బతుకు బస్టాండ్ అయ్యిందని తమాషాగా అంటుంటాం.. కానీ ఇప్పుడు  ఆ మాటే నిజం కాబోతోంది. ఆంధ్రా రాజధాని అమరావతి  పూర్తయ్యే వరకూ .. ఏపీ సర్కారు కోసం బెజవాడ బస్టాండ్ రాజధాని అవతారం ఎత్తబోతోంది.

ఆంధ్రాలో ప్రభుత్వ పాలనా యంత్రాంగం  హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో ప్రభుత్వ శాఖ  విజయవాడలో కార్యాలయాలు ఏర్పాటు  చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ముందున్న ఆర్టీసీ విజయవాడలోని పండిట్ నెహ్రూ ప్రయాణ ప్రాంగణంలోని భవనం మొదటి అంతస్తును పరిపాలనా భవనంగా నిర్మించుకుంది.

45వేల 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్టీసీ కార్యాలయం సిద్ధమైంది. ఆర్టీసి ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక ఛాంబర్లు, ఉద్యోగుల కోసం క్యాబిన్లు సిద్ధమయ్యాయి. నగరం నడిబొడ్డులో ఆర్టీసీకి మంచి స్థలం అందుబాటులో ఉండటంతో మిగిలిన శాఖలు కూడా తమకూ ఆఫీసు స్థలం కావాలని ఆర్టీసీని అడుగుతున్నాయి.

ప్రధానంగా  పోలీసు శాఖకు చెందిన ముఖ్యమైన విభాగాలు తమ కార్యాలయాల కోసం రవాణా సంస్థను సంప్రదించాయి. పండిట్ నెహ్రూ ప్రయాణ ప్రాంగణంలోని .. మిగతా అంతస్థులను తమకు కేటాయించాల్సిందిగా పోలీస్ శాఖ కోరుతోంది. మిగతా అంతస్థుల్లో శ్లాబ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ఫ్లోరింగ్ వేయటంతో పాటు లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. సిఐడి, ఇంటలిజెన్స్ విభాగాలతో పాటు రవాణా, కార్మిక శాఖల కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: