ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ వారసుడు ఆయన కుమారుడు లోకేశ్ అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ లోకేశ్ ను ఎలా ప్రమోట్ చేస్తారు అన్న విషయంపై ఇంకా టీడీపీ వర్గాల్లో క్లారిటీ లేదు. లోకేశ్ ను ఇప్పుడే మంత్రిని చేయాలని కొన్నాళ్లుగా టీడీపీ లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడంటే కాస్త తగ్గారు కానీ.. కొన్ని వారాల క్రితం మంత్రులు రోజూ ఇదే పాట పాడేవారు.

ఆయన రాష్ట్ర మంత్రిగా కాదు కేంద్ర మంత్రిని చేస్తారని కూడా గతంలో కథనాలు వచ్చాయి. అశోక్ గజపతి స్థానాన్ని లోకేశ్ కట్టబెడతారని కూడా అన్నారు. కానీ ఏదీ నిజం  కాలేదు.  మరి ఇంతకీ లోకేశ్ ఏమనుకుంటున్నారు.. తన రాజకీయ భవితవ్యం గురించి లోకేశ్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు.. ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉన్న విషయాన్ని తాజాగా లోకేశ్ బయటపెట్టాడు.  

తాను మంత్రివర్గంలో చేరుతున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని టీడీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తేల్చి చెప్పారు. తాను 2019 ఎన్నికల కోసం  సిద్దం అవుతున్నానని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అంటే లోకేశ్ మంత్రి వర్గంలో చేరడన్నమాట. పూర్తిగా పార్టీని తన హస్తగతం చేసుకుని ఇప్పటి నుంచే 2019 ఎన్నికల కోసం ప్రిపేరవుతాడన్నమాట. 

బహుశా 2019 ఎన్నికల అభ్యర్థి కూడా లోకేశ్ కావచ్చని కూడా ఆయన తాజా కామెంట్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. పనిలో పనిగా జగన్ పై మరోసారి విమర్శలు కురిపించారు లోకేశ్. విపక్ష నేత జగన్ కు కేంద్ర నేతలు ఎవరూ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని, పార్లమెంట్ సెంట్రల్ హాలులో మాత్రమే కలుసుకున్నారని లోకేశ్ కామెంట్ చేశారు. తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని, కాని వైసిపి నుంచి ఎమ్మెల్యేలు కాని వారు కూడా బయటకు వస్తున్నారని లోకేష్ గుర్తు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: