ఒక సమాజం ఎంతగా అభివృద్ధి చెందింది అని చెప్పాలంటే ఆ సమాజం శుచీ, శుభ్రతలను బట్టి చెప్పేయవచ్చు. అలా నాగరికతను కొలిచే అంశాల్లో మరుగుదొడ్లు ఒక కీలక అంశం. మన దేశం ఎంతగా అభివృద్ధి చెందినా ఇంకా ఆరుబయట మల విసర్జన అనేది మనల్ని వేధిస్తున్న ఒక అనాగరిక అంశంగా చెప్పుకోవచ్చు. అందుకే మోడీ ప్రభుత్వం దీన్ని రూపుమాపేందుకు కృత నిశ్చయంతో ఉంది. 

ఇప్పటికే స్వచ్ఛ భారత్, అమృత్, స్మార్ట్ సిటీస్ అంటూ వివిధ రకాల పేర్లతో పథకాలు అమలు చేస్తున్న మోడీ సర్కారు మరుగుదొడ్ల నిర్మాణాన్ని కూడా ఓ  ప్రయారిటీ అంశంగా భావించి ఉదారంగా నిధులు అందిస్తోంది. దీన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని ఆరుబయట మల విసర్జన లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలను భావిస్తున్నారు. 

కేంద్ర పథకాలకు తోడు రాష్ట్రం కూడా చేయూతనివ్వడంతో రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణం యుద్దప్రాతిపదకన జరుగుతోంది. దాని ఫలితంగానే ఏపీ ఇప్పుడు ఓ కొత్త రికార్డు సృష్టించబోతోంది. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన లేని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించనుంది. అక్టోబరు 2 నాటికి ఆంధ్ర ప్రదేశ్ ఈ ఘనత  సాధించనుందని  కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

బహిరంగ మల విసర్జన.. అనాగరిక చిహ్నం.. 


మొత్తం ఏపీలోని 110 పురపాలక సంఘాల్లో వచ్చే అక్టోబరు 2 నాటికి వందశాతం  మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మల విసర్జన లేకుండా చేస్తామని రాష్ట్ర అధికారులు  ఇటీవల విశాఖపట్నం వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబాకు వివరించారట. పట్టణ ప్రాంతాల్లో లక్షా 94 వేల 336 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని... ఏపీ సర్కార్‌ లక్ష్యంగా నిర్దేశించుకోగా లక్షా 4 వేల 732 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తైందట.

ఆ మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేసి దేశంలోనే పట్టణ ప్రాంతాల్లో ఆరుబయట మల విసర్జనలేని తొలి రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకోనుంది. సో.. ఏపీ స్వర్ణాంధ్ర సంగతేమో కానీ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మారుతుందన్నమాట మంచి విషయమే కదా..!



మరింత సమాచారం తెలుసుకోండి: