ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. అందుకే మందుబాబులు ఈ వేడి తట్టుకోలేక చల్లచల్లని బీరు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. అయితే అక్కడా వారికి కష్టమే వచ్చిపడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీరు కొరత రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. డిమాండ్ కు సరిపడా బీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. అందులోనూ ఇతర రాష్ట్రాల నుంచి బీరు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకు నెలకు సగటున 13.3లక్షల కేసులు బీరు విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది మార్చి నెలలో 22 లక్షల కేసులు అమ్ముడు పోయాయి. 2015 సంవత్సరం ఇదే నెలలో 19 లక్షల కేసులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ఈ మార్చిలో మరో మూడు లక్షల కేసులు అధికంగా విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో 11 నుంచి 12 లక్షల కేసులు మాత్రమే బీరు ఉత్పత్తి జరుగుతోంది. 

ఎండలు తగ్గుముఖం పట్టే వరకు బీర్లు విక్రయాల్లో భారీగా పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్న ఎక్సైజ్‌ అధికారులు డిమాండ్‌కు తగిన మేర బీర్‌ సరఫరా ఉండేట్లు చర్యలు చేపట్టారు. గత నెలలో ఏకంగా 29లక్షల కేసులు బీరు అమ్ముడు పోయింది. మే, జూన్‌ నెలల్లో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు  అంచనా వేస్తున్నారు. నెల ఒక్కింటికి దాదాపు 30 లక్షల కేసులు డిమాండ్‌ ఉండడంతో తీవ్ర కొరత ఏర్పడింది.

బీరు కోసం దిగుమతి సుంకం రద్దు.. 


ఇప్పటి వరకు తెలంగాణ, మహారాష్ట్ర, పాండిచ్ఛేరి, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ కొరతను అధిగమిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల మహారాష్ట్రలో, తెలంగాణ రాష్ట్రంలో తలెత్తిన నీటి ఎద్దడి ప్రభావం అక్కడి బీరు ఉత్పత్తి కంపెనీలపై పడింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీరు ఉత్పత్తి తగ్గింది. ఆ ప్రభావం ఏపీకి దిగుమతి అయ్యే బీరుపై పడింది. 

బీరు తయారైన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలంటే..  బల్క్‌ లీటరు ఒక్కింటికి నాలుగు రూపాయలు ఎగుమతి, దిగుమతి సుంకం ఉత్పత్తిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఒక్కో బీరు కేసుపై రూ.30లు ఎగుమతి, దిగుమతి సుంకాలు కింద చెల్లించాల్సి వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌కు బీరు సరఫరా చేసేందుకు కొన్ని ఉత్పత్తి సంస్థలు విముఖత వ్యక్తం చేశాయి. అందుకే ఆయా కంపెనీలను ప్రోత్సహించేందుకు మే, జూన్‌, జూలై నెల వరకు మూడు నెలలపాటు దిగుమతి సుంకం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: