ఏపీకి ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీపై విమర్శల జోరు పెంచింది. రాష్ట్రానికి హోదా గానీ, ఎలాంటి రాయితీలుగానీ  ఇవ్వమంటూ కేంద్రం తెగేసి చెబుతుంటే.. పోరాడకుండా చంద్రబాబు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని వైసీపీ నిలదీస్తోంది.  రాష్ట్రానికి ఇంతగా అన్యాయం జరుగుతుంటే...కేంద్రాన్ని ఎవరూ విమర్శించవద్దంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణమంటోంది. 

హోదా కోసం పోరాడరు, పోరాడేవాళ్ళ కాళ్లు పట్టుకొని లాగుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బాబుపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల ప్రాణవాయువైన హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని బాబును ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారా, మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని బాబును హెచ్చరించారు. 

హోదాపై ఉమ్మడిగా ఉద్యమం కొనసాగించేందుకు ముందుకు వస్తారో లేదా తేల్చుకోవాలన్నారు.  హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మ మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం ఉండదని ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు. హోదా గానీ, రాజధానికి , భూములిచ్చిన రైతులకు ఎలాంటి రాయితీలుగానీ ఉండవని  తేల్చిచెప్పారు. ఐనా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దనడంలో ఆంతర్యమేంటో చెప్పాలని  పద్మ బాబును నిలదీశారు.

ఏపీకి జరుగుతున్న అన్యాయంపై నోరెత్తవద్దని మాట్లాడే హక్కు బాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏపీలో పెట్టుబడులకు తగిన వాతావరణం లేదు. రాయితీలు లేవు. హోదా ఉంటే ఈపాటికి  పారిశ్రామికవేత్తలు రెక్కలు గట్టుకొని వచ్చేవాళ్లు. పెట్టుబడులు వచ్చేవి, ఉద్యోగం వస్తుందన్న భద్రత ఉండేది. హోదా లేకపోవడంతో యువత దిక్కుతోచని పరిస్థితిలో ఉందని పద్మ వాపోయారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: