కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు తిరిగి వస్తున్నారు. ఆయన ఐదు రోజులపాటు వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్లారు. ప్రతి ఏటా వేసవిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లటం ఆనవాయితీ. చంద్రబాబు రాష్ట్రంలో లేని ఈ ఐదు రోజుల్లో కీలకపరిణామాలే జరిగాయి. 

హోదా ఇచ్చేది లేదని బీజేపీ తేల్చి చెప్పేసింది. ఇక టీడీపీ దుష్ప్రచారాన్నిఎండగడతామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తేల్చి చెప్పేశారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల హడావిడి వచ్చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి సీటు దక్కనీయకుండా చేయాలన్న ఆలోచన ఉంది. మరోవైపు ఫిరాయింపులపై వైసీపీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. 

విదేశాల నుంచి వస్తూనే యాక్షన్ లో దిగిపోతారా.. 




ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని తేల్చి చెప్పేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 17 న ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ పర్యటనలో ప్రధానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు రాక ఆసక్తి రేపుతోంది. 

ఇన్నిరోజులపాటు కాస్త స్తబ్దుగా ఉన్న ఏపీ రాజకీయాలు ఇక హాట్ హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ పర్యటన నుంచి రాగానే చంద్రబాబు యాక్షన్ లోకి దిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15, 16 తేదీల్లో ఆయన విజయవాడలోనే ఉండి ప్రధాని భేటీకి సంబంధించి అధికారులు, పార్టీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 17వ తేదీన సీఎంతో కూడిన ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: