నారా లోకేష్ టీడీపీలో క్రియాశీలకం కానున్నారా? సొంత జిల్లా చిత్తూరు నుంచే ఆపని ప్రారంభించారా? సంక్రాంతి పండగకు వచ్చిన లోకేష్ పనిలో పనిగా పార్టీ నేతలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారా? అన్న ప్రశ్నలకు అవునన్న సమాధానం వస్తోంది. ఇప్పటి వరకు తెరవెనుక ఉండి టీడీపీ వ్యవహారాలను చక్కబెట్టిన లోకేష్ కొంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవరిస్తున్నారు. సంక్రాంతి పండుగకు నారావారి పల్లెకు వచ్చిన లోకేష్ జిల్లా నేతలు, కార్యకర్తలతో కలివిడిగా మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలతో లోకేష్ సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని లోకేష్ ను కోరినట్లు సమాచారం. ఇప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ.. రాబోయే రోజుల్లో తాను కీలకం అన్న సంకేతాల్ని పంపుతున్నారు.  లోకేష్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన తీరు ఆనాటి చంద్రబాబును తలపిస్తోందని చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. జిల్లా టీడీపీలో చంద్రబాబు స్థానాన్ని, బాధ్యతల్ని మోయగలిగే సమర్థుడు లోకేష్ అనే భావనలో కార్యకర్తలు ఉన్నారు. మొత్తానికి చినబాబు పార్టీ నేతలను సమన్వయం చేసే పనిని ముందు తన సొంత జిల్లా నుంచే ప్రారంభించారని సీనియర్ నేతలు అంటున్నారు.  మొత్తానికి చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలంతా నారావారిపల్లెకు లోకేష్ ను కలిసేందుకు రావడం ఆహ్వానించదగిన పరిణామమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో లోకేష్ ప్రతిభకు నిదర్శనమని వారు అభినందిస్తున్నారు. మరోవైపు లోకేష్ కూడా చంద్రబాబు పాదయాత్ర తర్వాత సైకిల్ యాత్ర చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందువల్లే కార్యకర్తలతో ఇప్పటి నుంచే కలిసిపోతున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: