ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా రెండే అంశాలు తెరపై కనిపిస్తున్నాయి..ఏపీ ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్లు. అయితే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నే తాము అమలు చేయమని చెబుతున్నట్లు కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంటున్నారు. ఆ మద్య ఈ విషయంలపై పెద్ద ఉద్యమమే తీసుకు వచ్చారు. అంతే కాదు తన ఇంట్లోనే బందీ చేసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు కదిలి వచ్చాయి..వ్యహారం శృతి మించిపోతుందని భావించిన తెలుగు దేశం పార్టీ నాయకులు ముద్రగడను బుజ్జగించే పనిలో పడ్డారు.

ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని వాగ్ధానం చేసి ఆయనతో నిరహారా దీక్ష మానిపించారు. అయితే ఇప్పటి వరకు హామీలపై ఎలాంటి స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో ఆగస్టులో ఉద్యమం చేయడానికి సిద్దమయ్యారు ముద్రగడ.  ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల సాధన కోసం వివిధ పార్టీలకు చెందిన నాయకుల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు ముద్రగడ. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణ రావులను కలిశారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కి ఫోన్ చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

తాజాగా ముద్రగడ పద్మనాభం మంగళవారంనాడు ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబును కలిశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం జల్‌పల్లిలోని ఫాంహౌస్‌లో హీరో మోహన్‌బాబును ఆయన కలిశారు.ముద్రగడ పద్మనాభం తనకు సన్నిహితుడని మోహన్ బాబు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఆయన సూచన మేరకు కుమారుడు మంచు విష్ణు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: