తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగుస్తుంది. ఏ రాజ‌కీయ పార్టీయైనా త‌మ త‌మ పంథాల‌తో ముందుకు పోతూ ప్ర‌జల హృదయాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. కొన్ని పార్టీలు అందులో స‌ఫ‌ల‌మౌతుంటారు. మరికొన్ని పార్టీలు విఫ‌ల‌మౌతారు. కానీ అధికారంలోకి రావ‌డానికి ముందే ముఖ్య‌మంత్రి అయితే ఏమీ చేయాలి? ఎలా చేయాలి? అన్న విష‌యాల‌లో గులాబీ దళ‌ప‌తి  కే.చంద్ర‌శేఖ‌ర్ రావు కు స్ప‌ష్ట‌త ఉన్న‌ట్లు ఉంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన త‌న‌తో ఇటు పార్టీ నాయకులు, అటు ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన వారు అడుకునే ప్రమాదం ఉంద‌ని గ్రహించిన కేసీఆర్ రెండంచెల వ్యూహాన్ని ర‌చించారు. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాన‌న్న సంకేతాలు ఆరంభంలోనే పంపారు. దీంతో అధికార  యంత్రాగంతో పాటు పార్టీ యంత్రాగం కూడా తోక జాడించ‌డానికి సాహ‌సించ‌లేదు. మొత్తం అధికారాన్ని త‌న గుప్పిట్టో పెట్టుకోవ‌డానికి తెలంగాణ సెంటిమెంట్ ఆయ‌నకు బాగా ఉప‌యోగ‌ప‌డింది. అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్ర‌యోగించి మొత్తం  అన్ని వ్య‌వ‌స్థ‌ల‌నూ త‌న ఆధీనంలోకి తెచ్చుకున్నారు.


 ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా ప్ర‌తిప‌క్షం లేకుండా చేశారు....

కనీసం ప‌ది లక్ష‌ల రూపాయ‌ల చెల్లింపులు కూడా జ‌ర‌గ‌కుండా క‌ట్ట‌డి చేశారు. అదే స‌మ‌యంలో త‌న చ‌ర్య‌ల‌పై మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం జ‌ర‌గ‌కుండా మీడియాను క‌ట్ట‌డి చేశారు. ఏబీఎన్ చానెల్ తో పాటు మ‌రో చానెల్ ను నిషేధించ‌డం ద్వారా రాష్ట్రంలోని మీడియా సంస్థ‌ల‌న్నింటినీ త‌న దారికి తెచ్చుకున్నారు. దీంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌ల‌కు మీడియాలో చోటు లేకుండా పోయింది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంలో పురుడు పోసుకున్న  కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌కు విశేష ప్రచారం ల‌భించింది. దీంతో ముఖ్య‌మంత్రి గా కే చంద్ర‌శేఖ‌ర్ రావు ప‌నితీరు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుకూల వాత‌వ‌ర‌ణం ఏర్ప‌డింది. ముఖ్య‌మంత్రి త‌రచుగా చెప్పే బంగారు తెలంగాణ ఆయ‌న‌తోనే సాధ్య‌మ‌న్న భావ‌న మెజారిటీ ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింది. ప‌నిలో ప‌నిగా రాజ‌కీయ వ్యూహానికి కూడా ప‌దును పెట్టారు. ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డంలో ఆయ‌న స‌ఫలీకృతులయ్యారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే ల‌ను టీఆర్ఎస్ లో చేర్చుకుని పార్టీ బ‌లాన్ని పెంచుకున్నారు. కేసీఆర్ వ్యూహం ముందు నిల‌బ‌డ‌లేక ప్ర‌తిప‌క్షాలు విల‌విల‌లాడే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆయ‌న వ్యూహాల ముందు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు బేల‌త‌నంతో  బెంబేలెత్తుతున్నారు.



కోదండ‌రామ్, గ‌ద్ద‌ర్ ల‌ను ఏకాకుల‌ను చేశారు....

ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డం అనైతిక‌మైనా ప్ర‌జ‌ల‌పై దాని ప్ర‌భావం ప‌డ‌లేదు.  ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలే ఇందుకు నిద‌ర్శ‌నం. రెండేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ త‌ర‌పున 15 మంది ఎన్నిక కాగా... ఇప్పుడు ఆ పార్టీలో ముగ్గురే మిగిలారు. 21 మంది స‌భ్యులు ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదాను ఆ పార్టీ ఎప్పుడు కోల్పోతుందో తెలియ‌ని ప‌రిస్థితి. గడిచిన రెండేళ్ల‌లో ఆయ‌న రాజ‌కీయ వ్యూహ ర‌చ‌న‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయించారు. ప్ర‌తి ఎన్నిక‌ను ఒక స‌వాల్ గా తీసుకుని తన పార్టీ బ‌లాన్ని నిరూపించుకుంటూ వచ్చారు. ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక ప్ర‌కారం ఉప ఎన్నిక‌ల‌లో భారీ మెజారిటీలు స‌మ‌కూర్చుకున్నారు. కేసీఆర్ త‌ర‌హాల‌లో ముంద‌స్తు వ్యూహ ర‌చ‌న చేయ‌గ‌ల నాయ‌కులు ప్ర‌తిప‌క్షంలో కొర‌వ‌డ‌టం కూడా క‌లిసి వ‌చ్చింది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కీల‌క భూమిక పోషించిన ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ వంటి వారిని కూడా ఏకాకులుగా చేశారు. శ‌త్రువులు సైతం ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా విమ‌ర్శించ‌లేని వాతావ‌ర‌ణం క‌ల్పించారు. ప్ర‌జాయుద్ద నౌక‌గా పిలిచే గ‌ద్ద‌ర్ వంటి వారు ఇప్పుడు ఎక్క‌డున్నారో తెలియని ప‌రిస్థితి. తెలంగాణ వ‌స్తే న‌క్స‌లైట్లు రెచ్చిపోతార‌న్న అపోహ‌ల‌కు తెర దించారు. 


గ్రేట‌ర్ లో మజ్లిస్ పార్టీ కి చెక్....

గ‌త పాల‌కుల బాట‌లోనే న‌క్స‌లైట్ల ప‌ట్ల కేసీఆర్ క‌ఠినంగా వ్య‌వ‌హారిస్తున్నారు. మాట‌ల‌తో కాకుండా చేత‌ల‌తో స‌మాధానం చెబుతున్నారు. దీంతో చిన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డితే బ‌ల‌ప‌డ‌వ‌చ్చునన్న మావోయిస్టుల ఆశ‌లు ఆవిరి అయ్యాయి. తెలంగాణ‌లో అధికంగా ఉండే ముస్లింల విష‌యంలో కూడా ఆయ‌న ప‌క‌డ్బందీ వ్యూహ ర‌చ‌న చేశారు. మ‌జ్లిస్ పార్టీతో స్నేహాన్ని కొన‌సాగిస్తూనే ముస్లింల మ‌న‌స్సు చూర‌గొనే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. దీంతో భ‌విష్య‌త్తులో మ‌జ్లిస్ పార్టీతో చెడినా మ‌స్లింల‌తో కొంత శాతం  అయినా కేసీఆర్ కు మ‌ద్ద‌తు ఇచ్చే ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఉంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌లో మ‌జ్లిస్ తో పొత్తు లేక‌పోయినా ప‌లు డివిజ‌న్ల‌లో ముస్లింలు తెలంగాణ రాష్ట్ర స‌మితి కే ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్ప‌డితే విద్యుత్ సంక్షోభం నెల‌కొంటుంద‌న్న భ‌యం ఉండేది. ఉమ్మ‌డి రాష్ట్రం చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఈ అంశం పై విస్తృతంగా ప్రచారం చేశారు కూడా. అయితే ప్ర‌త్య‌ర్ధులు సైతం మాట్లాడ‌లేని విధంగా విద్యుత్ కొనుగోళ్ల‌ను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెంచి తెలంగాణ రాష్ట్రంలో కొర‌త లేకుండా చేయ‌గ‌లిగారు. ఈ విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం నూటికి నూరు మార్కులు సాధించారు.


ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్...
 
ఇక రాజ‌కీయ ప‌ర‌మైన వ్యూహర‌చ చేయ‌డంతో పాటు పాల‌నాప‌రమైన అంశాల‌లో కూడా త‌న‌దైన ముద్ర వేయ‌డానికి కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త ముఖ్య‌మంత్రుల విధంగా ఆలోచించ‌కుండా తెలంగాణ ప్ర‌జ‌లు ఏమి కోరుకుంటున్నారు? ఏమీ చేస్తే ప్ర‌జ‌ల మ‌న‌స్సు దోచుకోవ‌చ్చు? అన్న దానిపై దృష్టి పెట్టి ప‌థ‌కాల‌కు రూప క‌ల్ప‌న చేశారు. ఫ‌లిత‌మే మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వంటి ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్టారు. శాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించినట్టుగా సాగునీటి ప్రాజెక్టుల‌కు ఏటా 25 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయ‌గ‌లిగితే తెలంగాణ లోని బీడు భూముల‌న్నీ స‌స్య‌శ్యామ‌లం అవుతాయి. ముఖ్య‌మంత్రి త‌ల‌పెట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై కొంత మందికి అభ్యంత‌రాలు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల‌పై శాస‌న స‌భలో ముఖ్య‌మంత్రి ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ను కాంగ్రెస్ పార్టీ బ‌హిష్క‌రించింది. అయితే ముఖ్య‌మంత్రి వివ‌రించిన ప‌థ‌కాలు ఆచ‌ర‌ణ సాధ్యం కాదు. అని గానీ, రీ డిజైనింగ్ లో లోపాలు ఉన్నాయి అని గానీ కాంగ్రెస్ పార్టీ రుజువు చేయ‌లేక‌పోతున్నది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో ఉన్న లోపాల‌పై తాము కూడా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్  ఇస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంత వ‌ర‌కు ఆ ప‌నిచేయ‌లేదు.  


రాజ‌శేఖ‌ర్ రెడ్డి హాయాంలో ప్రాజెక్టుల్లో అవినీతి...

మిష‌న్ భ‌గీర‌థ‌, సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో  భారీ అవినీతి జ‌రుగుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు స్పందించడం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం తింటే తిన్నారు ప‌ని చేస్తే చాలు అన్న భావ‌న ప్ర‌జ‌ల్లో నెల‌కొన‌డ‌మే. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా సాగునీటి ప్రాజెక్టుల‌లో అవినీతి చోటుచేసుకుంది. అయినా ప్ర‌జ‌లు  ఆ అంశాన్ని ప‌ట్టించుకోకుండా రెండవ పర్యాయం కూడా ఆయ‌న‌కు అధికారం క‌ట్ట‌బెట్టారు. అధికారంలో ఎవ‌రు ఉన్నా ఎంతో కొంత అవినీతికి పాలుప‌డ‌టం స‌హ‌జం. ఇంత‌కు ముందెవ్వ‌రూ ఆలోచించ‌ని విధంగా కేసీఆర్ ఆలోచిస్తూ ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్టారు. అది చాలు అన్న భావంతో ప్ర‌జ‌లు ఉన్నారు. మిష‌న్ భ‌గీర‌థ పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న‌ప్పుటికీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యి బీడు భూములకు నీరు అందిన‌ప్పుడే ఆయ‌న‌కు రాజ‌కీయ ఫ‌లాలు  అందుతాయి. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆఆర్ ఇచ్చిన హామీల‌లో చాలా వ‌ర‌కు నెర‌వేర్చిన‌ప్ప‌టికీ ప్ర‌ధాన మైన‌వి ఇంకా నెర‌వేర్చ‌వ‌ల‌సి ఉంది. ఇందులో ప్ర‌ధానమైన‌వి పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, ద‌ళితుల‌కు కుటుంబానికి మూడు ఎక‌రాల భూమి, ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ లు వంటివి ఉన్నాయి. 


ముస్లింల కు రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు మిగ‌తా రెండు వాగ్దానాల అమలులో కేసీఆర్ ప్ర‌భుత్వం ఇంత వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌క‌పోయినా ప్ర‌జ‌ల‌లో మాత్రం ఆయ‌న ప‌ట్ల సానుకూల‌తే ఉండ‌టం విశేషం. ఈ మూడు అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని ఇప్ప‌టిక‌ప్పుడు నిల‌దీయ‌డానికి ప్ర‌జ‌లు సిద్దంగా లేరు. మొత్తంమీద గులాబీ ద‌ళ‌ప‌తికి తెలంగాణ సెంటిమెంట్ భాగా క‌లిసొచ్చింది. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడే ళ్ల వ్య‌వ‌ధి ఉంది కనుక అప్ప‌టికి ప‌రిస్థితి ఎలా ఉంటుందో తెలియ‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: