చంద్రబాబు కులం మారిపోయిందా.. అసలు కులం మారుతుందా.. అని ఆశ్చర్యపోకండి.. ఇది ఆయన చెప్పిన మాటే.. తన కులం పేదరికం అని.. పేదరికంపై పోరాటమే తన జీవన ధ్యేయమని చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ సభలో చెప్పారు. అంతకు ముందు చంద్రబాబు ఎక్కువగా సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అని చెప్పేవారు. 

ఇప్పుడు ఇంకాస్త డెప్త్ గా ఉండాలని చంద్రబాబు భావించినట్టున్నారు. అందుకే నవ నిర్మాణవారోత్సవాల్లో ఆయన కొత్త నినాదం అందుకున్నారు. నా కులం పేదరికం.. పేదరికంపై రాజీలేని పోరాటం చేస్తా.. పేదలందరూ ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేవరకూ పోరాటం చేస్తా అంటూ జనంలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. నవ నిర్మాణ వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేదిశగా సాధించే ప్రగతి, భవిష్యత్తు కార్యచరణపై సదస్సు నిర్వహించారు.

పేదరికమే నా కులం - చంద్రబాబు



సంక్షేమ కార్యక్రమాలున్నాయని పని చెయ్యడం మానేస్తే జీవన ప్రమాణాలు పడిపోతాయని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామనీ..  పేదవాళ్లకు అండగా ఉంటూ వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాల్ని నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ రైతుల పేరుతో అడ్డమైనవారికి సర్కారు ధనం దోచిపెట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణలో ఆదాయం, అదనంగా డబ్బున్నా అక్కడి ప్రభుత్వం రైతుకి లక్ష ఇవ్వగా తమ ప్రభుత్వం మాత్రం లక్షన్నర ఇచ్చామని గుర్తు చేశారు. ఈ ఏడాది 3 వేల 200 కోట్ల రూపాయల రుణమాఫీ చేయనున్నామనీ.. దీనికి సంబంధించిన నిధులు ఈ నెలలో విడుదల చెయ్యనున్నట్లు చంద్రబాబు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: