రాష్ట్ర రాజకీయాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. హైదరాబాద్ అంటే ఎందుకంత క్రేజ్. రాజకీయ పార్టీలు నేతలు హైదరాబాద్ పై ఎందుకు మోజు పెంచుకున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్డీయే మూడు రాష్ట్రాల విభజన జరిగినపుడు తలెత్తని సమస్య తెలంగాణ విషయంలో ఎందుకు ఇలా జరుగుతోందన్నది చర్చనీయాంశమైంది. మూడు రాష్ట్రాలకు రాజధాని సమస్య కూడా రాలేదు. కానీ హైదరాబాద్ విషయంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు కోటిమంది ప్రజలు నివశిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి అనేకమంది ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇండియాలోనే హైదరాబాద్ ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. దీంతో సీమాంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుదారులు మొత్తం సొమ్మును ఇక్కడే పెట్టేశారు. ముఖ్యంగా ఎంపీలు లగడపాటి, కావూరి లాంటి వారైతే దాదాపు వారి ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒకవేళ హైదరాబాద్ ను తెలంగాణలో కలిపితే వారి ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో తెలంగాణ ప్రజల కంటే ఇతర ప్రాంతాల ప్రజలే ఎక్కువగా ఉన్నారని అందుకే అది అందరిసొత్తని లగడపాటి వ్యాఖ్యానిస్తున్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన సమైక్యాంధ్ర సదస్సులో కూడా మరోసారి కేసీఆర్ కు సవాల్ విసిరారు. చేతనైతే కేసీఆర్ హైదరాబాద్ లో పోటీ చేయాలని... కేసీఆర్ గెలిస్తే తాను సమైక్యాంధ్ర గురించి మాట్లాడబోనని లగడపాటి ప్రకటించారు.  అటు హైదరాబాద్ లో బలంగా ఉన్న ఎంఐఎం కూడా ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకిస్తోంది. ఒకవేళ విభజన అనివార్యమైతే హైదరాబాద్ ను రాయలసీమతో కలిపి రాయల్ తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎంఐఎం ఈ వైఖరి తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. తెలంగాణలో ఎంఐఎం కు పెద్దగా పట్టులేదు. దీంతో వారు హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అవుతారు. కానీ రాయలసీమలో కలిపితే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పట్టు సంపాదించవచ్చని ప్లాన్ చేస్తోంది. అందుకే హైదరాబాద్ ను విడగొట్టి ఏ ఒక్క ప్రాంతానికో రాజధానిగా చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎంఐఎం అంటోంది. ఇక టీఆర్ఎస్ మాత్రం హైదరాబాద్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తోంది. హైదరాబాద్ తమ సొత్తని కేసీఆర్ ఘంటాపథంగా చెబుతున్నారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇస్తేనే తమకు ఆమోదమని తేల్చిచెబుతున్నారు. దీంతో కేంద్రం ఆలోచన ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తుందా? లేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రెండు ప్రాంతాలకు కొత్త రాజధానులు ఏర్పాటు చేస్తుందా? అందుకే అదనపు బలగాలను పంపి పరిస్థితిని కంట్రోల్ చేయబోతోందా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి హైదరాబాద్ సమస్య ను పరిష్కరించడం కేంద్రానికి పెద్ద సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆంతా ఆందోళనగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: