కాపుల రిజర్వేషన్లు, తుని ఘటనపై పెట్టిన కేసుల ఉపసంహరణ కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం.. అరెస్టు చేసిన రాజమండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లినా దీక్ష మాత్రం విరమించలేదు. సరికదా.. కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా మొండిగా దీక్ష కొనసాగిస్తున్నారట. ఈ విషయం ఆసుపత్రిలోని వైద్యులే చెబుతున్నారు. ఇలా చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. 

మూడు రోజులకు పైగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందట. ఆయన శరీరంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిశోర్ చెబుతున్నారు. ముద్రగడ ఆరోగ్యం పరిస్థితిపై శనివారం రాత్రి 9 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. 


ముద్రగడ 50 గంటలుగా ఆహారం తీసుకోవడం లేదని, పరిస్థితి ఇలానే కొనసాగితే ముద్రగడ ఆరోగ్యం బాగా క్షీణిస్తుందని తెలిపారు. ముద్రగడ కనీసం వైద్య పరీక్షలకు కూడా అంగీకరించడం లేదని చెప్పారు. వీలును బట్టి బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కించి వైద్యం చేయాల్సిందేనని ఆయన చెబుతున్నారు. మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ నీరసించి పోయారు. 

ముద్రగడ మాత్రం వైద్యులను కూడా తన వద్దకు రానీయడం లేదు. బలవంతంగా వైద్యం చేస్తే.. తలపగులకొట్టుకుంటానంటూ ఆయన బెదిరిస్తున్నారు. ముద్రగడకు షుగల్ వ్యాధి ఉంది. దీంతో ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. ఈ పరిస్థితి ముత్రపిండాలను దెబ్బతీస్తుందంటున్నారు వైద్యులు. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం దీక్ష విరమింపజేసే ప్రయత్నాలు కనిపించడం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: