నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్రానికి మరో షాక్ తగిలింది. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలపై జులుం చేయాలన్న మోడీ సర్కారు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ రెబల్స్ ను రెచ్చగొట్టి అక్కడి సర్కారును కూలదోసిన వ్యవహారంలో ఎదురుదెబ్బ తగిలింది. 

అరుణా చల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడి గవర్నర్ కొన్నాళ్ల క్రితం రద్దు చేసారు. కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ విశ్వాసం కోల్పోయిందన్న కారణంతో ఈ రద్దు జరిగింది. కాంగ్రెస్ లోని కొందరు రెబల్స్ ను తమవైపు తిప్పుకున్న బీజేపీ ఈ సాహసానికి ఒడిగట్టింది. అప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతిపాలన సాగుతోంది. 


తన సర్కారు రద్దును వ్యతిరేకిస్తూ అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబామ్ తుకీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. దాన్ని పూర్తిగా కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. 

సుప్రీంకోర్టు నిర్ణయంతో నబామ్ తుకీ మరోసారి అరుణాచల్ సీఎం అవుతారు. మోడీకి ఇలాంటి షాక్ ఇదేం కొత్త కాదు.. ఆ మధ్య ఉత్తరాఖండ్ లోనూ ఇదే సిట్యుయేషన్ రిపీటైంది. అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతిపాలన విధించారు. దీనిపై సుప్రీంకోర్టును కాంగ్రెస్ పెద్దలు ఆశ్రయిస్తే.. మళ్లీ బలపరీక్షకు ఆదేశించింది. అందులో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ మళ్లీ పగ్గాలు చేపట్టింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: